Mar 16,2023 21:15

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి - రాయచోటి
ఝరికోన, గాలివీడు, రామాపురం, ఎల్‌ఆర్‌పల్లె లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించి భూ సేకరణ ఏప్రిల్‌ 30 నాటికి పూర్తి చేయాలని తహశీల్దార్లను కలెక్టర్‌ గిరిష పిఎస్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో భూసేకరణ వేగవంతంపై సంబంధిత తహశీల్దార్లు, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఝరికోన, గాలివీడు, రామాపురం , ఎల్‌ఆర్‌ పల్లె లిఫ్ట్‌ ఇరిగేషన్‌ భూ సేకరణ ఎంత చేశారు, ఎంత చేయాలి, ఏ స్టేజిలో ఉంది, తదితర వివరాలు అడిగి తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో ఏప్రిల్‌ చివరి నాటికి భూసేకరణ ప్రక్రియలను పూర్తిచేయలని సంబంధిత సూచించారు. ప్రతివారమూ భూ సేకరణలో జరిగిన పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సంబంధించి భూసేకరణ సర్వే పనులు, ఎ 2 తయారుచేసి సోమవారంలో నివేదికలు పంపాలని సూచించారు. సర్వే చేసేటప్పుడే రికార్డులన్నీ కూడా తీసుకోవాలన్నారు. భూ సేకరణ ప్రక్రియలో ఏప్రిల్‌ 7లోగా ప్రభుత్వ భూములు అప్పగించాలన్నారు. ఏప్రిల్‌ 21, డిఎల్‌ఎస్‌సి పూర్తి కావాలన్నారు. తర్వాత ఏప్రిల్‌ 30లోగా ఫామ్‌ ఎఫ్‌ రావాలన్నారు. తహశీల్దార్లందరూ సీరియస్‌గా తీసుకుని పనిచేయాలన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులను వేగవంతం చేస్తూ పూర్తి చేయాలన్నారు. కలిబండా, బెస్తపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సంబంధించి ల్యాండ్‌ ప్లాన్‌ షెడ్యూల్స్‌ 15 రోజుల్లోగా ఇవ్వాలని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. లెక్కిరెడ్డిపల్లె మండలంలో జరుగుతున్న చెరువు పనులను పరిశీలించానని, వేగవంతంగా జరుగుతున్నాయని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ అభినందించారు. ఈ చెరువు పనులు పూర్తయి చెరువులో నీళ్లు వస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని, తద్వారా రైతులకు మేలు కల్గుతుందని చెప్పారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనులను వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, ఇరిగేషన్‌ జిల్లా అధికారి కష్ణమూర్తి, కలెక్టరేట్‌ భూ సేకరణ విభాగం సూపరింటెండెంట్‌ మహేశ్వర రెడ్డి, తహశీల్దార్లు పాల్గొన్నారు.