Dec 26,2021 07:11

మతతత్వం, మార్కెట్‌తత్వం మేళవించిన బిజెపి కేంద్రం దేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని ఆర్థిక సమస్యల మూల కారణాలను పట్టించుకోకుండా ఈ ప్రధాన పాలక పార్టీలన్నీ తమలో తాము కీచులాడుకుంటూ ప్రజల మధ్య కూడా ఉద్రిక్తతలు పెంచుతుంటే-సమస్యలపై వారందరినీ ఏకం చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఎజెండాను ముందుకు తేవడానికి సిపిఎం పోరాడుతున్నది. ఈ కృషిలో తాడేపల్లి మహాసభ ముఖ్యమైన ఘట్టం కానుంది. పాలక పార్టీల తగాదాలు అధికార పోరాటాల మధ్య పరిభ్రమించడం గాక ప్రజల కోణంలో సమరశీల ఉద్యమాలను పెంపొందించేలా దిశానిర్దేశం చేయనుంది. విభజిత రాష్ట్ర సమగ్రాభివృద్ధి, కేంద్రం నుంచి సాధించుకోవలసిన కోర్కెలు, లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం అంకితం కానుంది. సమున్నత కమ్యూనిస్టు సంప్రదాయాలకు పునరంకితం కానుంది.

'ఏరా డింగిరీ...?' అంటే 'ఎప్పటి మొత్తుకోలే దేవరా...!' అని కాల గతిలో మరో ఏడాది గడిచిపోతున్నా మన రాజకీయాల గతి మారడం లేదు. రాష్ట్ర పరిస్థితీ దారికి రావడం లేదు. గత ప్రస్తుత కేంద్ర రాష్ట్ర పాలక పార్టీల విధానాలు శ్రుతి తప్పడం ఇందుకు ఏకైక కారణం. ఈవారమే తీసుకుందాం. రామతీర్థంలో ఆలయ నిర్మాణ శంకుస్థాపనపై వివాదం, సినిమా టికెట్ల రేట్లపై రభస. ఒకవైపు వైసిపి మరోవైపు టిడిపి నేతల మధ్య షరా మామూలుగా కేసులు, వివాదాలు, దూషణలు, దూకుళ్లు. తమను తాము అనుకోవడం తప్ప తన జోలికి రాని వాళ్లిద్దరి మధ్య బిజెపి నేతల సరికొత్త ఎదురుదాడి. రాష్ట్రానికి చేసిన వాగ్దానాల అమలు గాని, చేయాల్సిన సహాయం గాని చేయకపోగా తాను చేసిందేదో పక్కదారి పట్టినట్టు అదరగణ్నం. కేంద్ర నిధుల వినియోగంపై శ్వేతపత్రం ప్రకటిస్తామని బెదిరింపు. సరిగ్గా ఈ సమయంలో ఇళ్లకు అదనపు కరెంటు మీటర్లను అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయంతో ప్రజలపై వేయి కోట్లకు పైగా అదనపు భారం పడుతున్న పరిస్థితి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలని ఎంతగా కోరినా పోరినా బేఖాతరు చేసిన మోడీ ప్రభుత్వం తన నిర్ణయంలో ఇసుమంతైనా మార్పు లేదని ప్రకటించడం. తమాషా ఏమంటే బిజెపి తరహాలో టిడిపి మాజీ మంత్రి రామ మంత్ర రాజకీయాలకు పాల్పడితే ముఖ్యమంత్రి జగన్‌తో సహా వైసిపి నేతలు తమ హిందూత్వ యోగ్యతలు నిరూపించుకోవడానికి ఆయన ఇంట్లోనే గోరక్షణ శాల స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపున ఆ బిజెపి నేతలేమో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కోరింది గనకే ఇచ్చామని బుకాయిస్తున్నారు. అంతేగాని తాము నిరాకరించిన వైనం ఒప్పుకోవడం లేదు. తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీకే రూ. 19 వేల కోట్ల వరకూ ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఏడేళ్ల మీద పదిహేను వేల కోట్లు ఇవ్వడం గొప్ప విషయంగా పార్లమెంటు లోనే చెప్పేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూనే దాని నిర్మాణానికి నిధులు విడుదల చేయకపోవడానికీ రాష్ట్రంపైనే నెపం నెడుతున్నారు. ఆఖరుకు వైసిపి అంటే ఏమీ చేతగాని ప్రభుత్వం అని కొత్త నిర్వచనం తయారు చేశారు. తమాషా ఏమంటే తమను ఇంతగా అపహాస్యం, అలక్ష్యం చేస్తున్నా అభ్యంతరం చెప్పడానికి గాని ఆగ్రహించడానికి గాని అధికార పార్టీ సిద్ధం కావడం లేదు. అధికార ప్రతినిధులు లేదా ద్వితీయ శ్రేణి మంత్రులు ఏదో నాలుగు మాటలనడం తప్ప రాష్ట్రాధినేతగా వున్న ముఖ్యమంత్రి ఖండించడం లేదు. ప్రభుత్వం స్పందించడం లేదు. కేంద్రం చెప్పేవన్నీ అవాస్తవాలనీ అందింది శూన్యమనీ ఖండించడం లేదు. వైసిపి సన్నాయి నొక్కులతో సరిపెడుతుంటే టిడిపి అదీ లేదు. అంతా జగన్‌ ప్రభుత్వ అపరాధమేనని నిర్ధారిస్తున్నది. తమ పాలన చివరి ఏడాది ధర్మయుద్ధం అంటూ కేంద్రంపై ధ్వజమెత్తి రాష్ట్రానికి రావలసినవి ఏకరువు పెట్టిన టిడిపి గాని, చంద్రబాబు గాని ఆ తర్వాత వాటిలో ఏది అమలైందో చెప్పలేరు. ఎందుకంటే ఏమీ కాలేదు గనక! అయినా ధర్మ పోరాటం ఊసే ఎత్తకపోవడంలో మర్మం ఏమిటో తెలియదు. మరో కథానాయకుడు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అయితే తాను ప్రత్యేక హోదా కోసం పోరాడినపుడు ఎవరూ కలసి రాలేదంటూ దాన్ని విరమించేశారు. బిజెపితో ఏకంగా జట్టుకట్టి వైసిపి పై విరుచుకు పడుతుంటారు గాని కేంద్రాన్ని కనీసంగా విమర్శించరు. ఏతావాతా ఈ పార్టీలన్నీ రాష్ట్రంలో అధికారం కోసం పాకులాడ్డం, అందుకుగాను తిట్టిపోసుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారం గురించి స్థిరంగా ఆలోచిస్తున్న దాఖలాలే కనిపించవు.
 

                                                            రాజకీయ ప్రయోజనాలే సర్వస్వం

వారు ప్రభుత్వంలో వున్నారా ప్రతిపక్షంలో వున్నారా అనేదాన్ని బట్టి విధానాలు మారిపోతుంటాయి. మారిపోతున్నాయి కూడా. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం విఫలమైందని జగన్‌ నిరంతరం ఆరోపించేవారు. విశ్వవిద్యాలయాల్లో సదస్సులు కూడా పెట్టారు. తనకు 25 మంది ఎం.పి లను ఇస్తే మెడలు వంచి తెస్తానన్నారు. తర్వాత ఏమైంది? మోడీకి పూర్తి మెజార్టి వచ్చింది గనక చేయగలిగింది లేదని, అడుగుతూనే వుంటామని ప్రమాణ స్వీకారం ముందే చేతులెత్తేశారు. రాజధాని మారుస్తానని ఎన్నడూ చెప్పని మాటను ప్రధాన ఎజెండాగా చేసి రెండేళ్లుగా దాని చుట్టే తిప్పుతున్నారు. ఈ విషయమై నిరసనలు, యాత్రలకు వైసిపి తప్ప అందరూ మద్దతునిచ్చారు. కాని కోర్టులో కేసు వేసిన టిడిపి నాయకులు మాత్రం విచారణ త్వరగా పూర్తి కావాలని గాక వాయిదా వేయించుకోవడానికి అభ్యర్థనలు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు ఉపసంహరించుకుంటున్నా మళ్లీ మరింత పకడ్బందీగా తీసుకొస్తామని ప్రకటించింది. తద్వారా ఒక త్రిశంకు స్వర్గంలో పరిస్థితి అయినా చట్టపరంగా అనిశ్చితి కొనసాగుతుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇది ఎజెండాగా వుంటే అమరావతి పేరిట తెలుగుదేశం, ప్రాంతీయ కోణంలో వైసిపి రాజకీయ వ్యూహాలు అమలు చేయాలని చూస్తున్నాయి. అంటే విభజిత రాష్ట్రంలో మరోసారి ప్రాంతాల వైరుధ్యాలను ముందుకు తేవడం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయన్నమాట.
 

                                                              కలుషిత వాతావరణం

ఇది చాలనట్టుగా జుగుప్సాకరమైన కుల వివాదాలు సోషల్‌ మీడియా లోనూ రాజకీయ వివాదాల్లోనూ తాండవిస్తున్నాయి. ఇవి న్యాయస్థానాలకూ విస్తరించి సిబిఐ దర్యాప్తు వరకూ వెళ్లాయి. ఒకవైపున కొందరు మంత్రులు మరోవైపున టిడిపి నేతలు కూడా బూతుల్లో పోటీ కొనసాగిస్తున్నారు. ఇందులో ఎవరు ముందు తిట్టారు ఎవరు ఎక్కువ తిట్టారు వంటి పంచాయితీలతోనే సరిపోతున్నది. మీడియా కూడా రెండుగా చీలిపోవడంతో జరిగే పరిణామాల నిజానిజాలు కూడా పాక్షికంగా చిత్రితమవుతుం టాయి. ముఖ్యమంత్రితో సహా తరచూ మీడియా సంస్థల పేర్లు తీసి విమర్శించడం, మరోవైపున కొందరు మీడియాధిపతులు రాజకీయ నేతల మధ్య కూడా తామే ప్రత్యర్థులమన్న తరహాలో నిరంతరం సవాళ్లు విరుద్ధ కథనాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఏది నిజమన్నది నిర్ధారించుకోవడం కూడా సమస్యగా మారింది. వైసిపి, టిడిపి మధ్య నిరంతర ఘర్షణలు, అరెస్టులు, కేసులు ఇదే నిత్యకృత్యమై పతాక శీర్షికలు ఆక్రమిస్తున్న స్థితి. గత ప్రభుత్వంలో జరిగిన ఏ అంశంపై చర్య తీసుకున్నా వెంటనే కక్ష సాధింపుగా చూపడం వల్ల నిజమైన తప్పులు ఏవో అనవసరమైనవి ఏవో తెలియని అయోమయ వాతావరణం దాపురించింది. పిడుక్కు, బియ్యానికి ఒకటే మంత్రంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే తమ కాలంలో జరిగిన వాటన్నిటినీ సమర్థించుకునే పనిలో టిడిపి నిమగమైంది. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలి, ఇప్పుడు జరిగే తప్పులపైనా పోరాడాలి. కాని గతంలో అన్నీ సరైనవని తెలుగుదేశం, ఇప్పుడు ప్రతిదీ గొప్ప నేనన్నట్టు చెప్పే వైసిపి ప్రచారాలతో రాజకీయ యుద్ధాలు ఎడతెగకుండా సాగుతు న్నాయి. ఈ క్రమంలో మొదటి దోషి కేంద్రం, బిజెపి తప్పించుకుపోవడమే గాక ఎదురుదాడి తీవ్రం చేస్తున్న వైపరీత్యం. ఆఖరుకు కుటుంబాలు, మహిళల పైన అసభ్య వ్యాఖ్యలకు దిగేంతగా పరిస్థితి దిగజారిపోయింది.
     ఈ వివాదాల మధ్య వీరంగాల మధ్య నిజమైన ప్రజా సమస్యల నుంచి విధానపరమైన అంశాలు మరుగున పడిపోతున్నాయి. పాలక పార్టీలుగా వాటి ఆర్థిక విధానాలలో తేడా లేదుగనక వాటిపై పోరాడటం ప్రధాన ప్రతిపక్షానికి పట్టదు. సంక్షేమ పథకాల ప్రచారం ప్రధానంగా వున్న పాలక పక్షం ఇతర విషయాలలో ప్రజలకు జరిగే కష్టనష్టాల గురించి ఆలోచించదు. కరోనా కూడా తోడై ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వనరుల సమీకరణ పేరిట స్థలాల అమ్మకం, కేంద్రం ఆదేశాలంటూ మునిసిపల్‌ విద్యుత్‌ తదితర భారాలు పెంచడం చూస్తున్నాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్వాధీనం కూడా ఈ పరంపర లోదే. ఇవి గాక విద్యారంగంలో అనేక మార్పులు వచ్చేశాయి. కౌలురైతుల సమస్యలు, ఉద్యోగులు, మునిసిపల్‌, పంచాయితీ కార్మికులు, అంగన్వాడీలు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వంటి వారి సమస్యల గురించి కోర్కెల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వీటిపై సిపిఎం, సిఐటియు వంటి కార్మిక సంఘాలు పోరాడటం తప్ప ప్రధాన ప్రతిపక్షానికి ఆసక్తి వుండదు. ఎందుకంటే వారు ఇంతకంటే భిన్నంగా చేసింది లేదు, చేసేది వుండదు. జాతీయంగా లౌకిక తత్వం, రైతాంగ పోరాటం వంటివి కూడా అసలే పట్టవు. అసలు ప్రపంచ బ్యాంకు తరహా సంస్కరణలకు తానే ఆద్యుడినని అతిశయాలు పోయే తెలుగుదేశం నాయకుడు వీటికి నిజంగా వ్యతిరేకం కాదు కూడా. ఈ కృషిలో వామపక్ష ఐక్యత కొంతవరకూ పెంపొందుతున్నా టిడిపి ని ప్రతిసారి బలపర్చే ఒక ధోరణి కూడా వుంది. మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపి కి వంత పాడుతూ వక్రగతికి మళ్లించిన ఈ ఈ రాజకీయ నేపథ్యంలో సిపిఎం వంటి శక్తి లేకపోతే వాస్తవిక కోణాన్ని ఆవిష్కరించడం దుర్లభమై వుండేది.
 

                                                                         పునరంకితం

ఈ సంక్లిష్ట సామాజిక రాజకీయ పరిస్థితిలో - మతతత్వం, మార్కెట్‌తత్వం మేళవించిన బిజెపి కేంద్రం దేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని, ఆర్థిక సమస్యల మూల కారణాలను పట్టించుకోకుండా ఈ ప్రధాన పాలక పార్టీలన్నీ తమలో తాము కీచులాడుకుంటూ ప్రజల మధ్య కూడా ఉద్రిక్తతలు పెంచుతుంటే-సమస్యలపై వారందరినీ ఏకం చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఎజెండాను ముందుకు తేవడానికి సిపిఎం పోరాడుతున్నది. ఈ కృషిలో తాడేపల్లి మహాసభ ముఖ్యమైన ఘట్టం కానుంది. పాలక పార్టీల తగాదాలు, అధికార పోరాటాల మధ్య పరిభ్రమించడం గాక ప్రజల కోణంలో సమరశీల ఉద్యమాలను పెంపొందించేలా దిశానిర్దేశం చేయనుంది. విభజిత రాష్ట్ర సమగ్రాభివృద్ధి, కేంద్రం నుంచి సాధించుకోవలసిన కోర్కెలు, లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం అంకితం కానుంది. సమున్నత కమ్యూనిస్టు సంప్రదాయాలకు పునరంకితం కానుంది. ఆంధ్ర ప్రదేశ్‌ విభజనానం తరం సిపిఎం మూడవ మహాసభ గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరుగుతుండడం ఒక విశేషమైతే ఇది గుంటూరు జిల్లాలో మూడవ సారి జరిగే మహాసభ కావడం మరింత ప్రత్యేకత.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి