- వాల్తేరు డివిజన్‌లో కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.2552.812 కోట్లు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : 'విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ వస్తుంది. కానీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. గతంలో కొత్త జోన్‌లను ప్రకటించాక పదేళ్లు కూడా పట్టిన సందర్భాలూ లేకపోలేదు' అని వాల్తేరు రైల్వే డిఆర్‌ఎం అనూప్‌కుమార్ శతపతి పేర్కొన్నారు. గురువారం ఆయన వాల్తేరు రైల్వేలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2022-2023 కేంద్ర బడ్జెట్‌లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, తూర్పు కోస్తా రైల్వేలోగల రాయగడ డివిజన్ కోసం రూ.40 లక్షలు కేటాయింపు జరిగినట్లు తెలిపారు. వాల్తేరు డివిజన్‌కు 2,552.812 కోట్లు కేటాయింపు జరిగిందని, ఈ నిధులతో కొన్ని కీలక ప్రాజెక్టులు పూర్తికానున్నాయని చెప్పారు. దీంట్లో కొత్త లైన్‌ల కోసం రూ.117.8 కోట్లు, రైల్వే డబ్లింగ్ పనుల కోసం రూ.2162.5 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. 2021-22 బడ్జెట్‌లో ఈ డివిజన్‌కు రూ.1192.6868 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగిందన్నారు. కొత్త రైళ్ల కోసం ఈ బడ్జెట్‌లో వాల్తేరు డివిజన్‌కు ఏమి ఇచ్చారన్న సమాచా రంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. వందేభారత్ రైళ్లలో విశాఖకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంద న్నారు. ఈ డివిజన్‌లో కొత్త రైల్వే లైన్ల కింద జైపూర్-మల్కాన్‌గిరి 130 కిలోమీటర్లు, జైపూర్-నవరంగపూర్ 138 కిలోమీటర్లు, నౌపడ బ్రాడ్‌గేజ్ 79 కిలోమీటర్లు, విజయనగరం-కొత్తవలస మూడోలైన్ కోసం నిధులు వచ్చాయని తెలిపారు. డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే దేశంలో కార్గో హేండ్లింగ్‌లో వాల్తేరు రైల్వే ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి వస్తుందన్నారు. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను సరైన సమయంలో విడుదల చేస్తామని చెప్పారు.










