ఎపికి కేంద్రం తీరని అన్యాయం
ప్రజాశక్తి-బిట్రగుంట : విభజన హామీను తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందని మండలం సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకయ్య పేర్కొన్నారు. కేంద్రం చేసిన బడ్జెట్‌పై సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం విధించిన బడ్జెట్లో సామాన్యులకు ఒరిగిందేమీ లేదని, బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ ఆస్తులను ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందన్నారు. పోలవరం అంశం 1956 నుండి వస్తున్న అంశమని దానికి సరైన బడ్జెట్ను కేటాయించకపోవడం బాధాకరమన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సరైన ఉపాధి లేక విదేశాలలో కట్టు బానిసల్ల మనవారు బతుకుతున్నారని, మన భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందిన దేశం అని తెలిపారు. భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలో రెండు పార్టీలకు సంబంధించిన ఎంపిలు ఉన్న వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బిట్రగుంటలోని లోకోషెడ్‌పై ఈ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమని, బిట్రగుంటలో రైల్వే పరంగా ఉన్న 1600 ఎకరాల భూమిలో రైల్వేకు సంబంధించిన యూనిట్‌ను ప్రారంభిస్తే బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో ఉన్న సుమారు 2000 మందికి యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి చల్ల నరహరి, కడనూతల సిపిఎం నాయకులు పోట్లూరి శ్రీనివాసులు, ఎస్.కె అన్వర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.










