గోరంట్ల : శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలోని ఎరుకుల కులస్తులకు చెందిన డి పట్టా భూములను ఏపీఐసీసీ ఛైర్మన్ మొట్టు గోవిందరెడ్డి కబ్జా చేసి, అందులో వెంచర్లు వేస్తున్నాడని దీనిని అడ్డుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పేదల భూమలను కబ్జా చేస్తున్న మెట్టు గోవిందరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ సిపిఎం నాయకులు శనివారం నాడు పాలసముద్రం గామంలోని పేదల భూమి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ మాట్లాడుతూ పాలసముద్రం గ్రామం హిందూపురం రోడ్డు వద్ద ఎరుకుల కులస్తులు 3.29 ఎకరాల భూమికి 1929లో డీ పొందారన్నారు. ఇందులో పంటలు కూడా సాగు చేసుకుంటున్నారని చెప్పారు. ఇటీవల ఈ భూమిలో ఏపీఐసీసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆయన అనుచరులు దౌర్జన్యంగా రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నారన్నారు. పేదలు ఈ భూములు తమవని వారితో వారించినా వినిపించుకోకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన పేద కుటుంబాలకు చెందిన భూములను స్వయంగా ఏపీ ఐసీసీ ఛైర్మన్ గోవిందరెడ్డి తన అధికార బలంతో లాక్కోవడం దుర్మార్గం అన్నారు. పోలీసులు, అధికారులు కూడా వారికి సహకరిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ బాధితులకు అండగా ఉన్న సిపిఎం నాయకులపై సిఐ దౌర్జన్యం చేస్తూ, అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తక్షణం ఈ కబ్జాను ఆపాలన్నారు.
కలెక్టర్ దృష్టికి సమస్య...
పేదల భూముల ఆక్రమణ విషయాన్ని సిపిఎం నాయకులు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం గోరంట్లలో ఇళ్ల జగన్న కాలనీలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన్ను సిపిఎం నాయకులు కలిశారు. భూమికి సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పేదల భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న ఏపీఐసీసీ ఛైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. భూ బాధితులకు న్యాయం జరగకుంటే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి, ఆందోళన చేపడుతామని సిపిఎం నాయకులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, నాయకులు రమేష్, ప్రవీణ్‌తో పాటు భూ బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










