మానవహారం నిర్వహిస్తున్న దృశ్యం
ఎపి జెన్కో రక్షణకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం
నెల్లూరు ప్రతినిధి:ఎపి జెన్కో ప్రయివేటీకరణ కాకుండా రక్షించుకోడానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని ఎపి జెన్కో పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఎపి జెన్కో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉద్యమం 365 రోజులకు చేరుకుంది.ఈ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. శనివారం తొలుత ఎపి జెన్కో గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఎపి జెన్కో ధర్మల్ ప్రాజెక్టును కాపాడుకుంటామని, ప్రయివేటీకరణ నిర్ణయం నిలుపుదల చేసి, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, నిర్వాసితులకు పరిహారం అందించాలని, స్దానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నినదించారు. ఎపి జెన్కో జేఏసీ, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన పోరాట సభలో పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. .మోహన్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిచో జెన్కో నుంచి మహా పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. జెన్కో ముట్టడికి సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎపి జెన్కోను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మూడవ యూనిట్‌ను జాతికి అంకితం చేసి మొత్తం మూడు యూనిట్లను కలిపి రూ.21వేల కోట్ల ప్రజల ఆస్తిని అదానీకి అంకితం చేసేందుకు పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ సంవత్సరం రోజులపాటు ఆందోళన చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎపి జెన్కోను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం ముఖ్యమంత్రి జగన్ చేతగానితనానికి నిదర్శనమన్నారు. జెన్కోను నష్టాల్లోకి నెట్టి ప్రయివేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యని, ఉద్యమాలను అణిచివేసేందుకు జీవో నెంబర్ ఒకటి తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోవడం తథ్యమని పేర్కొన్నారు.
ఎపి జెన్కో ఇంజినీర్ల అసోసియేషన్ నాయకులు గుమ్మడి శ్రీనివాసులు , యూనియన్ నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఇంజినీర్లు, రెగ్యులర్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఐ జిల్లా నాయకులు పి.శంకర్ కిషోర్, నందయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సిఎస్ సాగర్, కె రాంబాబు, ఐఎఫ్‌టియు న్యూ నాయకులు కె.లక్ష్మీరెడ్డి, పి.యానాదయ్య, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్, సిపిఎం నాయకులు గడ్డం అంకయ్య, నక్కరాధయ్య, టిడిపి నాయకులు యు.సురేంద్రబాబు, హరికష్ణ, రసూల్, కాంతారావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ , కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుమన్, పి. రామయ్య తదితరులు ప్రసంగించారు.
కార్యక్రమంలో ఎపి జెన్కో జెఎసి నాయకులు సిహెచ్.ఆదిశేషయ్య, , ఎ.అనిల్, సుబ్బలక్ష్మి, నక్క మోహన్ రావు, భాస్కర్, నాగరాజు, సునీల్, ఎం రవీంద్ర, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.నరసింహ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్.కె రషీద్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లాడి గోపాల్, భవన నిర్మాణ సంఘం నాయకులు ఎస్‌కె. చాంద్ బాషా, పి. సూర్యనారాయణ,ఆర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు .










