Jan 19,2023 21:38

ఎపి జెన్‌కో వద్ద ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు(ఫైల్‌)

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి తూట్లు పొడుస్తోంది.. కొత్త పరిశ్రమలు రాకపోగ,. ఉన్న పరిశ్రమలను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న ఎపి జెన్కో సూపర్‌ క్రిటికల్‌ ధర్మల్‌ ప్రాజెక్టును అమ్మకానికి పెట్టింది. ధర్మల్‌ ప్రాజెక్టును ప్రయివేటీకరించొద్దని కార్మికులు చేస్తున్న పోరాటం 365 రోజులకు చేరింది. న్యాయమైన కోర్కెల సాధన కోసం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు, కార్మికులు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు ఎపి జెన్‌కో పోరాటం ఏడాది అవుతోన్న సమయంలో ఆ ప్రాజెక్టును దక్కించుకోడానికి ప్రయత్నం చేస్తున్న కార్పొరేట్‌ శక్తులు ఒకడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. టర్మస్‌ ఆఫ్‌ కండీషన్‌ విషయంలోనూ, కార్మికుల ఉద్యమం ఫలితంగా ప్రయివేటీకరణ ఆగిందనే చెప్పాలి. ప్రభుత్వం మాత్రం చాపకిందనీరులా పనిచేస్తుంది.
కృష్ణపట్నం (దామోదరం సంజీవయ్య ధర్మల్‌ ప్రాజెక్టు) ఎపి జెన్‌కోను ప్రధాని నరేంద్ర మోడీ కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మకానికి పెట్టారు. ఇప్పటికే ఆసీయాలోనే అతిపెద్ద కృష్ణపట్నంపోర్టును ఆదానీకి అప్పగించారు. ఇది ఓ పథకం ప్రకారం జరిగిన కుట్రగా ప్రచారం సాగుతోంది. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.21 వేల కోట్లతో 24వేల మెగావాల్ట్‌ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్‌ క్రిటికల్‌ ధర్మల్‌ ప్రాజెక్టును 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీరుతాయని చెప్పారు. 2015లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు దీనికి సంబందించి 800 మెగావాల్ట్‌ చొప్పున రెండు యూనిట్లు ప్రారంభించారు. టిపి గూడూరు, ముత్తుకూరు ప్రాంతానికి చెందిన రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో 33 వేల ఎకరాల్లో, 33 వేల మెగావాల్ట్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయి. ఈ ప్రాంతమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని తెలుసు. తమ ఆరోగ్యాలు క్షీణిస్తాయని అప్పటి సైన్స్‌ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. అయినప్పటికీ ఉపాధి, ఉద్యోగం ఇస్తామని, పునరావాసం కలిగిస్తామని, ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో ప్రాజెక్టులొచ్చినా స్థానికులకు ఉపాధి, ఉద్యోగం సరిగా దక్కలేదు. పునారావసం ఊసేలేదు. 2015లో ఒక్కో యూనిట్‌ 800 మెగావాల్ట్‌ చొప్పున మూడు యూనిట్లకు శంకుస్థాపన చేశారు.800 మెగావాల్ట్‌ సామర్థ్యంతో గతంలో రెండు యూనిట్లు ప్రారంభించారు. గతేడాది అక్టోబర్‌ 26న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 800 యూనిట్స్‌ , మూడో యూనిట్‌ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రాజెక్టు బాగా పనిచేస్తుంది. నష్టాలు వస్తున్నాయని సాకుతో దీనిని ప్రయివేటీకరించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 1200 మంది అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, 338 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్న ప్రాజెక్టును గతేడాది జనవరి 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు 25ఏళ్లు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టులో 27 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానిది. ప్రయివేటీకర ణను ఆ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. గతేడాది అక్టోబర్‌ 20న బిడ్స్‌కు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి అదే నెల 26న జిల్లాకు రావడంతో దానిని వాయిదా వేసుకున్నారు. అప్పటి నుంచి టెండర్లు ప్రక్రీయ వాయిదా పడుతూ వస్తుంది. అదానీ కంపెనీ దీనిని దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తుంది. టర్మస్‌ ఆఫ్‌ కండీషన్‌ కొలిక్కిరాకపోవడంతో ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది. ఇదే సమయంలో ఏడాది నుంచి కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తుండడంతో ఏం జరుగుతుందోననే కాస్త వేచి చూసే దోరణీలో ఉంది. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ పోరాటం జరగడం ఇదే ప్రథమం. ఈ ఉద్యమం విజయవంతం కావాలని జిల్లా ప్రజలు , కార్మికులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
365 రోజుకు చేరిన కార్మికుల ఆందోళనలు
ఎపి జెన్కో పరిరక్షణ కమిటీ పేరుతో కార్మికులు చేపట్టిన ఉద్యమం రేపటితో 365 రోజుకు చేరనుంది. గతేడాది జనవరి 21న ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. అప్పటి నుంచి ప్రతి రోజు ఏదొక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు రోజు తమ విధులు నిర్వహిస్తూనే, పోరాటం సాగిస్తున్నారు. ఒక్క వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు ఈ పోరాటానికి మద్దతుగా నిలిచాయి.. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి, గ్రామాలు తరలించాలని, ఆరు సంవత్సరాల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమం ఏడాది అయిన సందర్భంగా 21 అన్ని రాజకీయపార్టీలు, కార్మిక, ప్రజా సంఘాల ఆథ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్మికులు నిర్వహిస్తున్న ఉద్యమం భవిష్యత్తు ఉద్యమాలకు ఆదర్శంగా కనిపిస్తోంది.