ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఆన్‌లైన్ యాప్ మోసానికి విద్యార్థి బలయ్యాడు. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంద్రసేనారెడ్డి (21) మెకానికల్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన ఆయన హాస్టల్‌లో ఉంటున్నారు. తోటి విద్యార్థులు పండుగకు సొంత గ్రామాలకు వెళ్లారు. ఇంద్రసేనారెడ్డి మాత్రం ఇంటికి వెళ్లలేదు. గురువారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ముందు ఆయన సూసైడ్ లేఖ రాశారు. లోన్‌యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఈ లేఖలో పేర్కొన్నారు. రూ.23 వేలు పెట్టుబడి పెట్టునట్టు సమాచారం. అందిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ లేఖను, విద్యార్థి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.










