Jul 18,2022 23:06

  •  కలెక్టర్‌కు ఆశా వర్కర్ల వినతి

ప్రజాశక్తి-విజయవాడ: ఎన్‌సిడిసిడి ఆన్‌లైన్‌ వర్క్‌ (హెల్త్‌ సర్వే) ఆశా వర్కర్లతో చేయించరాదని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల కోరారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్పందన కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావుకు యూనియన్‌ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమల మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయకపోయినప్పటికీ ఎన్‌సిడిసిడి ఆన్‌లైన్‌ వర్క్‌ తమ సొంత ఫోన్లతో నెట్‌ బ్యాలెన్స్‌ వేసుకుని చేయాల్సి వస్తోందన్నారు. ఒక వేళ చేయని పక్షంలో వారికి షోకాజ్‌ నోటీసులు ఇస్తామని అధికారులు బెదిరించడం సరికాదన్నారు. సర్వేకి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేసి ఐడి క్రియేట్‌ చేసినందుకు ఒక్కో ఐడికి ఐదు రూపాయలు చొప్పున ప్రభుత్వం అధికారులకు చెల్లిస్తుందని, ఆ డబ్బులు ఆశా వర్కర్లకు ఇవ్వకపోగా, ఈ పని ఆశాలదేనని బలవంతంగా ఆ పని చేయించడం దుర్మార్గమన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ సచివాలయాల్లో సబ్‌ సెంటర్లో సంతకాలు పెట్టాలని తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, తమ పరిధిలో ఉన్న మిగిలిన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఈ.దుర్గాలక్ష్మి, పి.శ్రీలక్ష్మి ,పి.పద్మావతి, సిఐటియు తూర్పు కష్ణా కార్యదర్శి కోటి బాబు తదితరులు పాల్గొన్నారు.