ఎన్నికలలోపే మహిళా చట్టాన్ని అమలు చేయాలి
ప్రజాశక్తి-కావలి : స్థానిక తుఫాన్ నగర్‌లో ఉన్న 'జమాయితే ఇస్లామీ హింద్' కార్యాలయంలో ''కావలి ఉమెన్ ఫోర్స్', జమాయతే ఇస్లామీ హింద్ సంయుక్త ఆధ్వర్యంలో చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల పార్లమెంటులో ఆమోదించబడిన చట్టాన్ని 2024 ఎన్నికల నుండే అమలు చేయాలని ఉమ్మడి తీర్మానంగా డిమాండ్ చేశారు. ఈ చర్చా వేదికకు ముఖ్య అతిథులుగా జమాయతే ఇస్లామి హింద్ రాష్ట్ర బాధ్యులు ఫాతిమా కౌర్, జిల్లా బాధ్యురాలు జహీదాబేగం పాల్గొని సందేశమిచ్చారు. వారు మాట్లాడుతూ 2029లో అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం చెపుతున్న ఈ చట్టాన్ని హడావిడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ఏ ఉద్దేశంతో ఆమోదించారన్నారు. పైగా ముస్లిమ్ మైనారిటీలు, ఓబిసి - ఎస్‌సి, ఎస్‌టి, అల్పసంఖ్యాక వర్గాల స్త్రీలకు కూడా మహిళా రిజర్వేషన్ వర్తిస్తుందని ఆమోదించే ముందే చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ సి.శారద చర్చను ప్రారంభించారు. 2029 వరకు వేచి ఉండవల్సిన అవసరం లేకుండా తాజాగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపాలని తమ చర్చావేదిక డిమాండ్ చేస్తుందన్నారు. కావలి ఉమెన్ ఫోర్స్ కార్యవర్గ సభ్యులు ఫాతిమా, నూర్జహాన్, లక్ష్మి, రమాదేవి, ఉపాధ్యక్షురాలు టి.సుజాత , జమాయతే ఇస్లామి హింద్ సభ్యులు హుమారా, సమీరా, బుష్రా , పర్విన్, షకీలా చర్చలో పాల్గొన్నారు.










