Mar 12,2023 22:12

పోలింగ్‌కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ

కదిరి టౌన్‌ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలి ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పిడిఎఫ్‌ బలపరిచిన అభ్యర్థులు వైసీపీ టిడిపి మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది. మండలి ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కదిరి డివిజన్‌లో మొత్తం 16 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రతి మండల కేంద్రానికి రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్ట భద్రులకు సంబంధించి 10 పోలింగ్‌ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల కొరకు కదిరి పట్టణంలో ఆరు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కదిరి డివిజన్‌ మొత్తంగా పట్టభద్రుల ఓటర్లు 7847 మంది ఉన్నారు. అందులో 5351 మంది పురుషులు, 2495 మంది మహిళలు ఉన్నారు. ఉపాధ్యాయులు ఓటర్లు డివిజన్‌ మొత్తం 726 ఉండగా పురుషులు 513, మహిళ ఉపాధ్యాయులు 213 మంది ఉన్నారు. వీరందరూ ఆయా పోలింగ్‌ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
హిందూపురం : సోమవారం నేడు జరగనున్న శాసన మండలి ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని ఎంజిఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ సౌజన్య లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్బంగా పట్టుభద్రుల కోసం 6, ఉపాద్యాయుల కోసం ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక సంఘ వ్యాప్తంగా పట్టుభద్రుల నియోజక వర్గం నుంచి పురుషులు 2719, మహిళలు 1665 మొత్తం 4384 ఓటర్లు ఉన్నారు. వీరి కోసం ఆరు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉపాధ్యాయ పోలింగ్‌ కేంద్రంలో పురుషులు 434, మహిళలు 328 మొత్తం 762 ఓట్లు ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్‌చార్జి ఎంఇ నీరజ, ఎఇలు సురేష్‌, నాగేంద్ర, మున్సిపల్‌, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగుతున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తహశీల్దార్‌ రామాంజనేయ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో రెండు గ్రాడ్యుయేట్లకు ఒకటి ఉపాధ్యాయులకు ఏర్పాటు చేశామన్నారు. మండల వ్యాప్తంగా పట్టభద్రులు 1715 మంది ఉపాధ్యాయులు 120 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. ఉదయం 8 నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్‌ విధించినట్టు ఆయన తెలిపారు.
చిలమత్తూరు : సోమవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వ సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంకాలమే ఎన్నికల అధికారులు సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. మండల వ్యాప్తంగా 782 మంది పట్టు భద్రుల ఓటర్లు, 32 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తహశీల్దార్‌ నాగరాజు, ఎంపిడిఒ రామ్‌ కుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు పోలింగ్‌కేంద్రాన్ని పరిశీలించారు.
కనగాన పల్లి : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మండల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రాలను ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. పోలింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కనగానపల్లి ఎస్‌ఐ హనుమంతరెడ్డితో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.