Nov 03,2021 06:47

గత కొద్ది సంవత్సరాలుగా భారత ఎన్నికల ప్రక్రియలో మహిళలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అధిక ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 1962 లోక్‌సభ ఎన్నికల్లో పురుషులు 62 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనగా...మహిళలు కేవలం 47 శాతం మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌ మారింది. 2014 నాటికి మహిళలు పురుషుల కన్నా కేవలం 1.5 శాతం తక్కువ మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ బీహార్‌, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో మహిళలు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అయితే పురుషులను మించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించారు. 2014 నుంచి మహిళలు భారతదేశ ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఓటింగ్‌లో అధిక సంఖ్యలో పాల్గొనడమే కాదు ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. 2019 ఫిబ్రవరిలో లోన్‌నీతి, సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సోసైటీస్‌ (సిఎస్‌డిఎస్‌) జంటగా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఐదు వేల మంది మహిళా ఓటర్లపై అధ్యయనం చేశారు. వారి నివేదిక ప్రకారం ప్రతి ఐదుగురిలో ముగ్గురు తాము ఓటు వేయడంలో కుటుంబ పెద్దల ప్రభావం ఏమీ లేదని, తన స్వంతంగా ఆలోచించి ఓటు వేస్తున్నామని చెప్పారు. ఈ సర్వే చేసిన వారిలో 70 శాతం మంది మహిళలు ఓటు వేసే విషయంలో తమ భర్తల ఇష్టంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేశామని చెప్పారు. మగవాళ్ల మాదిరే ఆడవాళ్లు కూడా రాజకీయాల్లో సమర్ధవంతంగా రాణించగలరని 68 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. గెలిచిన వారిని చూసి స్ఫూర్తి పొంది ఇంకా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావడానికి ముందుకు వస్తున్నారు.

భారత ఎన్నికల ప్రక్రియలో మహిళల చురుకైన పాత్రను గమనించిన కొన్ని రాజకీయ పార్టీలు వారిని కేంద్రంగా చేసుకొని సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. ఈ విధమైన పథకాలు అమలు చేసినందువల్లే 2019 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ మహిళల ఓట్లను అధికంగా రాబట్టుకొని మళ్లీ విజయాన్ని సాధించింది. మహిళల్లో 60 శాతం మంది ఆప్‌కు అనుకూలంగా ఓటు చేయగా పురుషుల్లో 49 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. అదే బిజెపి కి పురుష ఓటర్లలో 6 శాతం మంది అధికంగా ఓటు వేయగా, మహిళా ఓట్లలో ఆప్‌ బిజెపి కంటే 25 శాతం అధిక ఓట్లను పొందింది. దీంతో విజయం ఆప్‌ను వరించింది. 2020 ఎన్నికల్లో మహిళా సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీలకే మహిళలు ఓట్లు వేశారు. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వం అమలు చేసిన కన్యాశ్రీ పథకం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. అలాగే అసోమ్‌ లో గ్రామీణ మహిళల రుణాల రద్దు చేయడం బిజెపి విజయంలో కీలకపాత్ర పోషించింది. 2014 ఎన్నికల ఫలితాల్లో పురుషుల ఓటర్లలో ఎన్డీయేకు 19 శాతం అధికంగా రాగా, మహిళల ఓటర్లలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే వచ్చింది. ఈ పరిస్థితిని గమనించిన నరేంద్రమోడీ ఆ తర్వాత వుచితంగా సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేశారు. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మహిళల ఓటింగ్‌ కూడా పెరిగింది. అలాగే 2019 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు రుణాలు రద్దు చేస్తామన్న వైఎస్‌ జగన్‌ హామీ కూడా ఆ పార్టీకి విజయాన్ని చేకూర్చిపెట్టడడంలో కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లపైనే అన్ని పార్టీలూ గురి పెడుతున్నాయి. ఇందులో ప్రియాంకా గాంధీ ఒక అడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తమ పార్టీ తరపున 40 శాతం మంది మహిళలను పోటీకి నిలబెడతామని హామీనిచ్చింది. అంతేకాక విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, యువతులకు స్కూటీలు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కానీ గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో 403 సీట్లకు గాను కాంగ్రెస్‌ పార్టీకి ఏడు సీట్లు మాత్రమే లభించాయి. ఓటింగ్‌ ఐదు శాతం మించలేదు. అట్టడగు స్థాయిలో వున్న కాంగ్రెస్‌ పార్టీని ఉత్తరప్రదేశ్‌ మహిళలు ఎంతవరకు నమ్మి ఓట్లు వేస్తారో కొద్ది రోజుల్లో తేలనుంది.

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌