Mar 07,2023 21:17

వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌

       పుట్టపర్తి అర్బన్‌ : శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్టిష్ట ఏర్పాట్లు చేశామని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌ నుంచి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.నాగలక్ష్మి వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ స్పందన విసి హాల్‌ నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్‌ టిఎస్‌.చైతన్‌, అడిషనల్‌ ఎస్పీ రామకష్ణ ప్రసాద్‌, డీఆర్వో కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, కదిరి ఆర్డీవో రవీంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో శాసన మండలి ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. మార్చి 10 తేదీన రెండో విడత ఎన్నికల నిర్వహణపై పోలింగ్‌ అధికారులకు మరో దపా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పోలింగ్‌ సిబ్బందిని వారి సొంత మండలంలో కానీ, వారు విధులు నిర్వహించే మండలానికి కానీ ఎన్నికల విధులకు కేటాయించలేదని చెప్పారు. పోలింగ్‌ స్టేషన్లలో అవసరమైన అన్ని వసతులతో పాటు భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేసినట్లు చెప్పారు. పుట్టపర్తిలోని చిన్నపల్లె జడ్పీ హైస్కూల్‌లో రిసెప్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికీ వీడియోగ్రాఫర్‌, సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. బ్యాలెట్‌ బాక్సులకు సంబంధించి గ్రాడ్యుయేట్స్‌కు వైట్‌, ఉపాధ్యాయులకు పింకు కలర్‌ క్లాత్‌ బాగ్‌లు కేటాయించామని తెలిపారు. అంతకు ముందు అనంతపురం ఆర్వో, కలెక్టర్‌ నాగలక్ష్మి ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పక్కా ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాల్లో క్షుణ్నంగా వివరించాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ రామాంజనేయులు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఐఅండ్‌ పీర్‌ ఏడీ వేలాయుధం, సిపిఒ విజరు కుమార్‌, హౌసింగ్‌ అధికారి చంద్రమౌళి రెడ్డి, బ్యాలెట్‌ బాక్స్‌ నోడల్‌ అధికారి బాలాజీతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.