Mar 07,2023 19:55

మాట్లాడుతున్న జెసి తమీమ్‌ అన్సారీయా

జెసి తమీమ్‌ అన్సారీయా
ప్రజాశక్తి - రాయచోటి : శాసన మండలి ఎన్నికల నిర్వహణకు నియమ నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేశామని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌ లోని ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి అన్నమయ్య, పుట్టపర్తి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన జేసీలు, డిఆర్‌ఒలు, నోడల్‌ అధికారులతో శాసనమండలి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అనంతపురం జిల్లా రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్షి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లోని మినీ విసి హాల్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ ఓ సత్యనారాయణ, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో శాసన మండలి ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో అవసరమైన అన్ని వసతులతో పాటు భద్రతగా ఏర్పాట్లను కూడా సంసిద్ధం చేసుకున్నామని తెలిపారు. బ్యాలెట్‌ పత్రం, బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణపై పిఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చామన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, రిసెప్షన్‌ కౌంటర్లు, నార్మల్‌, సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలు, తదితర ప్రాంతాల వద్ద నియమ నిబంధనల మేరకు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దష్టిలో ఉంచుకొని జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు నోడల్‌ అధికారులందరికి కేటాయించామన్నారు అంతకు ముందు అనంతపురం జిల్లా రిటర్నింగ్‌ అధికారి , కలెక్టర్‌ నాగలక్ష్మీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాన్‌ పవర్‌, ట్రైనింగ్‌, మెటీరియల్‌, బ్యాలెట్‌ పేపర్‌, ట్రాన్స్పోర్ట్‌ మేనేజ్మెంట్‌, బ్యాలెట్‌ బాక్సుల ప్రొక్యూర్మెంట్‌, ఎలెక్టోరల్‌ రోల్స్‌, మైక్రో అబ్జర్వర్స్‌, వెబ్‌ కాస్టింగ్‌ తదితర కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాల్లో క్షుణ్ణంగా వివరించాలన్నారు.