Feb 21,2023 19:39

మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి రాయచోటి: జిల్లాలోని అధికారుల దరూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) నిబంధనలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన రోజు నుంచి జిల్లాలో కోడ్‌ అమలులో ఉందని ప్రభుత్వ కార్యాలయాలలో బ్యానర్లు, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి పోస్టర్లు ఉండకూడదన్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు కమిషన్‌ జారీ చేసిన నిబంధనలను, సూచనలను తప్పక పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు. మార్చి 13న నిర్వహించబోయే ఎన్నికల కోసం జిల్లాలోని పోలింగ్‌ స్టేషన్లలో అన్ని వసతులు ఉండేటట్టు చూడాలన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ కు పోలింగ్‌ నెంబరు తప్పక రాయాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులు అవసరం మేరకు సిద్ధంగా ఉంచుకుని పోలింగ్‌ మెటీరియల్‌ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వివిధ పార్టీల అభ్యర్థులు కుల, మత, ప్రాంతీయ పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదన్నారు. రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదన్నారు. మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదన్నారు. పోలింగ్‌ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం వంటివి నిషిద్ధమన్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం వంటివి చేయరాదని తెలిపారు. జిల్లాలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆరఒ సత్యనారాయణ, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.