3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకే చోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థితులు వేరు. వారి ఆహారపు విరామ సమయం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు రంగంలోకి దిగుతాయి.
భారత దేశంలో పేద, అణగారిన వర్గాల పిల్లల విద్య విషయంలో కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులలో ప్రతి ముగ్గురులో ఒకరు పాఠశాలకు తిరిగి రావడం లేదు. విద్యా రంగం నేడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించని పక్షంలో ముందుముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని యునెస్కో భారత్ ను హెచ్చరించింది. ఈ పరిస్థితి నుంచి బైటపడాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... పేద, అణగారిన వర్గాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కరోనా కారణంగా బడికి దూరమైన విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం (ఎన్.ఇ.పి), దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు చూస్తుంటే ఆ కొద్ది మంది పేద విద్యార్థులు కూడా చదువుకు దూరమైపోతారనేది స్పష్టమవుతోంది.
మ్యాపింగ్‌తో విద్య కేంద్రీకరణ
కేంద్ర ప్రభుత్వ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకుకు దాసోహమంటున్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం...నూతన విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తూ చిన్నారుల భవిష్యత్తును మొగ్గలోనే తుంచేస్తున్నది. పైకి మాత్రం ప్రపంచ స్థాయి విద్య అందిస్తామంటూ నమ్మబలుకుతున్నది. విద్యా రంగంలో నూతన విద్యా విధానం విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజానీకాన్ని మభ్యపెట్టేందుకు అవగాహన సదస్సులలో చెప్తున్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేస్తామని గొప్పలు చెప్తున్నారు. అందుకు, అంగన్వాడీ పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రాథమిక స్థాయి విద్య అందించేందుకు గాను వారిని ప్రాథమిక పాఠశాలలో కలుపుతామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వంకతో ...అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల అద్దెలు కట్టకుండా వాటి నిర్వహణకు పెట్టాల్సిన మదుపు తగ్గించుకోవాలనుకుంటోంది. దీంతో పసిపిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారం దూరమై మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతుంది. దీన్ని గ్రహించకుండా కేంద్ర ప్రభుత్వం...పెరిగుతున్న మాతా శిశు మరణాలు తగ్గించేందుకు స్త్రీల వివాహ వయస్సు 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా ఆటలాడుకునే వయసులో విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలవుతారు.
ఇకపోతే 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తామంటున్నారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు 3వ తరగతి పిల్లవాడిని అంతదూరం పంపించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే చాలా పాఠశాలలు రద్దీగా ఉన్న రహదారి పక్కన లేదా రహదారికి అవతలి వైపున ఉన్నాయి. వాహనాల రద్దీ వల్ల చిన్నారులకు ఎప్పుడేమవుతుందోనన్న భయం తల్లిదండ్రుల్లో ఉరది. అలాగని పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లి తీసుకురావడం కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు సాధ్యం కాని పని. అందుకే చదువులైనా మాన్పించేస్తార కానీ పిల్లలను అంత దూరం పంపలేమనే దగ్గరికొస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం దూర ప్రయాణం అసౌకర్యం అయినప్పటికీ దాన్ని అధిగమించి పిల్లలను ఉన్నత పాఠశాలకు పంపాలంటున్నది. ఉన్నత పాఠశాలల్లో అయితే సకల సౌకర్యాలు, ల్యాబులు, కంప్యూటర్లు ఉంటాయని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని ... పిల్లల మానసిక వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు హైస్కూల్ విద్య తోడ్పడుతుందని చెబుతుంది. అయితే అవే సౌకర్యాలు ప్రాథమిక పాఠశాలల్లో కల్పించవచ్చు కదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉన్న 5 తరగతులకు 5 క్లాసులు బోధించి మిగిలిన 3 పిరియడ్స్‌లో ముందున్న క్లాసుకు ప్రిపేర్ అయ్యేవారు. ఇప్పుడు ఈ 3,4,5 తరగతులను కలుపుతూ మొత్తంగా 8 తరగతులకు 8 క్లాసులను విరామం లేకుండా బోధించేట్లు చేయాలనుకుంటున్నది. దీంతో ఉన్న కొద్దిమంది ఉపాధ్యాయులతోనే అన్ని తరగతులకు సర్దుబాటు చెయ్యవచ్చు. మరో వైపు రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలను మూసివేస్తూ ఆ అధ్యాపకులను ఖాళీ పోస్టుల్లో భర్తీ చేస్తుంది. అదేవిధంగా ఎస్‌జిటి లకు కొంత శిక్షణ ఇచ్చి స్కూల్ అసిస్టెంట్లుగా బోధించాలంటున్నది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ఈ రకంగా అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సంవత్సరానికి ఒక డిఎస్సీ తీస్తామన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క డిఎస్సీ కూడా తీయలేదు. భవిష్యత్తులో సైతం తీయకుండా ఉండేలా రిటైర్మెంట్ వయస్సు రెండు సంవత్సరాలు పెంచింది. దీంతో డిఎస్సీకి ప్రిపేర్ అయినవాళ్లు దాన్ని పక్కన పెట్టి ఇతర ఉద్యోగాలకు సిద్ధం అవుతున్నారు. ఎన్‌ఇపి ద్వారా విద్యను ఒక దగ్గర కేంద్రీకరించి అధ్యాపకులను సర్దుబాటు చేస్తూ విద్యారంగానికి పెట్టాల్సిన ఖర్చు తగ్గించుకోవాలనుకుంటున్నది.
విద్య వ్యాపారీకరణ
'నాడు-నేడు' ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అదనపు భవనాలు గానీ అదనపు మరుగుదొడ్లు గానీ నిర్మించలేదు. ఉన్నఫళంగా విద్యార్థులను మెర్జ్ చేస్తే ఆ పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకోవాలి. ఇప్పటికే గదులు చాలక చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ గది, స్టాఫ్ రూమ్, స్టోర్ రూమ్‌లను తరగతి గదులుగా మార్చి బోధిస్తున్నారు. అంతే కాకుండా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకే చోట చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారి మానసిక పరిస్థితులు వేరు. వారి ఆహారపు విరామ సమయం వేరు. చిన్న పిల్లలు అంత సమయం వరకు ఆకలితో ఉండలేరు. అలాగని ముందుగా విరామం ఇస్తే వీరిని చూస్తూ పై తరగతి పిల్లలు పాఠ్యాంశాలపై ఆసక్తి కోల్పోతారు. ఈ సమస్యలు అధిగమించి ముఖ్యంగా అంత దూరం 3వ తరగతి పిల్లవాడు వెళ్లలేకపోవడంతో ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు రంగం లోకి దిగుతాయి. కొంత కాలానికి విపరీతంగా ఫీజులు పెంచి 'నచ్చితే చదవండి. లేకుంటే పోండి' అని చెప్తాయి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిద్దామంటే అవి మూతబడి ఉంటాయి. ఈ విధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వారికి నచ్చినట్టు దోచుకుంటూ విద్య ద్వారా వ్యాపారం చేసుకుంటాయి.
విద్య కాషాయీకరణ
ఇప్పటికే బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ... తన ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని చొప్పిస్తూ సిలబస్‌లో మార్పులు చేస్తున్నది. అయితే సిలబస్ రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉండటంతో...ఈ హిందూత్వ భావజాలాన్ని దేశమంతటా వ్యాపింపచేయడానికి ఆటంకం కలుగుతుంది. అందుకే సిబిఎస్‌ఇ సిలబస్ ద్వారా ఆ మార్గం సుగుమం చేసుకోవాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం చెప్పిన ప్రతీదానికి తల ఊపుతూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం .... రానున్న విద్యా సంవత్సరంలో 33 కెజిబివి లు, 16 ఆదర్శ పాఠశాలలు, ఎ.పి రెసిడెన్షియల్స్, గురుకులాలతో పాటు 500 పైగా ఉన్నత పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్ ప్రవేశ పెడతామంటున్నది.
అందుకే విద్యను కేంద్రీకరణ, కాషాయీకరణ, వ్యాపారీకరణ చేసే నూతన విద్యావిధానం రద్దుకై ఉద్యమిద్దాం. సంక్షోభం లోకి నెట్టబడుతున్న విద్యా వ్యవస్థను కాపాడుకుందాం.
వ్యాసకర్త : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు,
సెల్ : 9705545164
డి. రాము











