Mar 29,2022 06:59

ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించిన వాటిని ఏమేరకు అమలు చేస్తున్నారో కొలిచేందుకు రూపొందిస్తున్నదే ప్రపంచ సంతోష సూచిక. ప్రతి ఏటా ప్రచురించే ఈ వివరాల మేరకు 2022 సూచికలో 146 దేశాలకు గాను మనం 136వ స్థానంలో ఉన్నాం. గతేడాది కంటే 0.236 పాయింట్లు పెంచుకొని 139 నుంచి 136కు ఎగబాకాము. ఇది నిజంగా మోడీ భక్తులు పండగ చేసుకొనే అంశమే. అయితే, 2013లో 111వ స్థానంలో ఉన్నది...2015లో 117కు తరువాత 2020లో 144వ స్థానానికి దిగజారింది. తిరిగి పూర్వపు స్థానానికి ఎప్పుడు చేరుకుంటామో, జనాలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పి మరీ పండగ చేసుకోవాలి. 111లో ఉన్నప్పుడే మన్మోహన్‌ సింగ్‌ పాలనను జనం భరించలేక పోయారు. తరువాత దిగజారినా మోడీకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామని జనం భావించారు, భరిస్తున్నారు. గొర్రె కసాయిని నమ్ముతుందని ఎందుకు మన పెద్దలు అనుభవసారంగా చెప్పారో ఆలోచించాల్సిందే.

సంతోష సూచికల గురించి చూద్దాం. వరుసగా గత ఐదు సంవత్సరాల పాటు ఫిన్‌లాండ్‌ సంతోష సూచికలో మొదటి స్థానంలో వచ్చింది. మన దేశం చివరి పది స్థానాల్లో నిలిచింది. మనం ప్రతిదానికీ ఇరుగు పొరుగు దేశాలతో పోల్చుకుంటూ మన గొప్పలను చెప్పుకుంటున్నాం. సంతోష సూచికల్లో 2012 నుంచి (2014 మినహా) 2022 వరకు తొమ్మిది సంవత్సరాల సగటు 128.8 కాగా కనిష్టం 111, గరిష్టం 144 ఉంది.

వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సంతోష సూచికల్లో ప్రతి ఏటా మార్పులు ఉంటాయి. తలసరి జిడిపి, ఆరోగ్య జీవిత ప్రమాణాలు, సామాజిక మద్దతు, జీవన విధాన ఎంపిక అవకాశం, ఉదారత, అవినీతి వంటి అంశాలను పరిగణన లోకి తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచిక నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో కొత్త అంశాలను కూడా చేరుస్తారు. కొన్ని దేశాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అందువలన ప్రతి ఏడాదీ మార్కులు మారినా ఒక్కోసారి సూచికల్లో స్థానం మారకపోవచ్చు. మన జనాల్లో ఉన్న ఒక అవాంఛనీయ వైఖరి ఏమంటే మనకంటే దిగువన ఉన్నవారిని ఎద్దేవా చేయటం, మనం మరికొందరి కంటే చాలా దిగువన ఉన్నామని మరచిపోవటం.

నరేంద్రమోడీ నాయకత్వం లోని బిజెపి ఎప్పటికప్పుడు కొత్త నినాదాలను ముందుకు తెచ్చి జనాన్ని ఆకర్షించటంలో, మభ్యపరచటంలో ఎంతో ముందు వుందనటం అతిశయోక్తి కాదు. చెప్పిన కథ చెప్పకుండా కొత్త కథలు చెబుతోంది. అచ్ఛే దిన్‌, గుజరాత్‌ నమూనా వృద్ధి, నల్లధనం వెలికితీత, 2022 నాటికి నవభారతం, 2024 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి సాధన. 2022 ఆగస్టు పదిహేను నాటికి లేదా ఏడాది ఆఖరుకు సాధిస్తామని చెప్పిన అంశాల గురించి ఒక్కసారి చెప్పుకొని సంతోషిద్దాం.

1. జిడిపి వృద్ధి రేటు 9-10 శాతంగా ఉంటుంది. పెట్టుబడుల రేటు 2022-23 నాటికి 36 శాతానికి పెంపుదల, పది నూతన కల్పనల జిల్లాల ఏర్పాటు. దాతలతో నైపుణ్యాల పెంపుదల, ఆరవ తరగతి నుంచి నైపుణ్య శిక్షణకు స్కూళ్లు. ప్రస్తుతం 5.4 శాతంగా ఉన్న నైపుణ్య కార్మికులను కనీసం 15 శాతానికి పెంచటం, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 30 శాతానికి పెంపు, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇరవై నుంచి 30 లక్షలు, పర్యాటక రంగంలో నాలుగు కోట్ల ఉద్యోగాలు, గనుల రంగంలో 50 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన.

2. ప్రతి పౌరుడికి బ్యాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్‌, ఉద్యోగానంతర ప్రణాళికల సేవలు అందచేత,

3. రైతుల ఆదాయాలు రెట్టింపు, పొలాలన్నింటికీ జలాల సరఫరా, పొలాల్లో వదలివేసిన గడ్డిని తగులబెట్టకుండా చూడటం, దేశంలో గాలి కాలుష్యాన్ని సగానికి తగ్గించటం, ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం.

4. ప్రతి కుటుంబానికి గ్యాస్‌ సిలిండర్‌, రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చూడటం, ముంబై-అహమ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు పరుగులు (ఇప్పుడు దీనికి ఒక తుది గడువు అంటూ లేదు గానీ 2023 డిసెంబరుకు పూర్తి అని చెబుతున్నారు).

5. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, ఇళ్లలో మరుగుదొడ్లు, చేతులతో మలమూత్రాల ఎత్తివేత నివారణ, రోజంతా విద్యుత్‌ సరఫరా.

6. 2012-13లో ఉన్న 7.7 శాతం పారిశ్రామిక ఉత్పాదకత రెట్టింపు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌, ప్రతివారూ దాన్ని ఉపయోగించేలా చర్యలు, ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పోషకాహారలేమి నివారణ. ప్రస్తుతం 21 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెంపు, పదవ తరగతి పూర్తి గాకుండా ఏ ఒక్క విద్యార్థీ మధ్యలో బడి మానకుండా చూడటం. ఉన్నత విద్యలో 25 శాతంగా ఉన్న చేరికలను 35 శాతానికి పెంచటం

7. ఏడు వందల జిల్లా కేంద్ర ఆసుపత్రులు వైద్య కేంద్రాలుగా వృద్ధి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య నిపుణులకు ప్రయివేటు పరిశ్రమలవారితో శిక్షణ, మెడికల్‌ టూరిస్టులను ఆకర్షించేందుకు ఇరవై స్వేచ్ఛా జోన్ల ఏర్పాటు, దేశంలో 11,082 మందికి ఒక అలోపతి వైద్యుడు ఉన్న స్థితిని ప్రతి పద్నాలుగు వందల మందికి ఒకరుండేట్లు చూడటం, వెనుకబడిన ప్రాంతాల్లో వంద చోట్ల కొత్త విహార కేంద్రాల ఏర్పాటు. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి కోటీ 20 లక్షలకు పెంచటం, స్వదేశీ పర్యాటకుల సంఖ్యను 1,614 నుంచి 3,200 మిలియన్లకు పెంచటం.

8. చమురు, గ్యాస్‌ దిగుమతుల పది శాతం తగ్గింపు (2022-2023). 80 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధనాన్ని 175 గిగావాట్లకు పెంచటం.

9. 1.22 లక్షల కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులను రెండు లక్షల కిలోమీటర్లకు పెంచటం. దశాబ్దాల తరబడి 2017 నాటికి పూర్తిగాకుండా ఉన్న ప్రాజెక్టుల పూర్తి. ఇలాంటి కబుర్లతో గతంలో కాంగ్రెస్‌ కాలక్షేపం చేసింది. ఇప్పుడు బిజెపి చేస్తున్నది.

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని, త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారి ఏలుబడిలో సంతోష సూచిక ఇలా తగులడుతోందేం అన్నదే ప్రశ్న. సంతోష సూచిక లెక్కింపులోకి తీసుకొనే జిడిపి తలసరి సగటు సూచికలో గత నాలుగు సంవత్సరాలుగా మనది 102-103 స్థానాల్లో, ఆరోగ్య జీవిత సూచికలో 104-107, సామాజిక మద్దతులో 141-145 స్థానాల్లో ఉన్నప్పుడు జనాల్లో ఆనందం ఎక్కడ ఉంటుంది? నేపాల్‌ కూడా పేదరికంలో తన స్థానాన్ని 48 స్థానాలు ఎగువకు గణనీయంగా మెరుగు పరుచుకోగా మన దేశం 28 స్థానాలు కోల్పోయింది మరి!

ఎనిమిదేళ్ల ఏలుబడిలో ఆవిరైన సంతోషం

ఎం. కోటేశ్వరరావు 

/ వ్యాసకర్త సెల్‌: 8331013288 /