ఎంఎల్‌ఎకు నిరసన సెగ
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని కంపసముద్రం సచివాలయం పరిధిలోని చాబోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డికి ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం ఆ కుటుంబానికి నవరత్నాల్లో భాగంగా అందజేసిన సంక్షేమ ఫలాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించారు. గ్రామంలో ప్రభుత్వ భూములు అన్వాక్రాంతమవుతున్నాయని కొందరు గ్రామస్తులు ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకురావడంతో వెంటనే భూములను పరిరక్షించాల్సిందిగా రెవెన్యూ అధికారులకు సూచించారు. గ్రామంలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయం ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకొచ్చారు. గృహ నిర్మాణశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, విక్రమ్ రెడ్డి గెలవాలని 101 కొబ్బరికాయలు కొట్టానని అయినా గృహ నిర్మాణం బిల్లులు రాలేదని, ఇంటి నిర్మాణం అలాగే ఆగిపోయిందని, తమ సమస్య పరిష్కరించలేదని నిలదీశారు. మరోమహిళ పూర్వకాలం నుండి తమ అత్తా మామల పేరుతో ఉన్న భూములను మాపేరున మార్చాలని పలుమార్లు తిరిగినా, కంప్యూటర్ అడంగల్లో వేరే వారి పేరు నమోదు అయిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని తెలిపారు. సమస్యలపై పలుమార్లు గ్రామస్తులు ఎంఎల్‌ఎను నిలదీశారు. సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎవెంట మాజీ కన్వీనర్ శ్రీనివాసులునాయుడు, సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు హరితేజ, జి.శ్రీనివాసులు, హరిబాబు, నారాయణరెడ్డి, ఎంపిడిఒ నాగమణి, మండలాధికారులు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.










