ఎంఎల్‌ఎకు గిరిజనుల గోడు
ప్రజాశక్తి-అల్లూరు : కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి విచ్చేయగా ఆయన వద్ద గిరిజనులు చేరుకొని వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్, వైసిపి మండల ఎస్‌టిసెల్ అధ్యక్షుడు దాసరి పోలయ్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి అల్లూరు చెరువులో సంపదను దోచుకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అంతేకాకుండా గిరిజనులకు చెందిన వలలను లాక్కొని ఎస్‌టిల పైన నకిలీ పత్రాలు సృష్టించి ఎస్‌సి, ఎస్‌టి కేసులు నమోదు చేయించారని ఆయన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అప్పట్లో ఒక వైసిపి నాయకుడు ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు ఇస్తామని నమ్మ బలికించి అంతా దోచుకెళ్లాడంటూ వివరించారు. స్పందించిన ఎంఎల్‌ఎ గిరిజనులకు ఆ చెరువు దక్కే విధంగా సహకరిస్తానని తెలిపారు. నార్త్ ఆములూరు సర్పంచ్ షేక్ కరిముల్లాషా ఖాదర్ మాట్లాడుతూ తమ గ్రామంలోని సిజెఐఎఫ్‌ఎస్ మిగుల భూములను ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు కేటాయించాలని కోరారు. అలాగే ఏనుగుల బావికి చెందిన పంచాయతి గుంట 8.60 సెంట్లు ఆక్రమించుకోవడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వడ్డెపాలెం నుండి గొల్లపాలెం వరకు రోడ్డును ఏర్పాటు చేయాలని విన్నవించారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పట్టా భూములు తీర ప్రాంతంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయన్నారు. రైతులు భూములకు సంబంధించి వన్ బి, అడంగల్ లేక అనేక ఇక్కట్లుపడుతూ ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారని తెలియజేశారు. ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలనే దృక్పథంతో జగనన్న సాధికారిత సర్వే ఏర్పాటు చేసి హద్దురాళ్లను నిర్మించామన్నారు. తద్వారా రైతులు ఎంతో ప్రయోజనాన్ని పొందుతారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అర్జీ రూపంలో లేదా సమాచారం తెలిపితే వెంటనే స్పందిస్తానన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఒ శ్రీదేవి, ఇఒపిఆర్‌డి పెంచల వీరేంద్ర, మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు నీలం సాయికుమార్, కోడూరు సాధక్ కుమార్ రెడ్డి, జెడ్‌పిటిసి చలంచర్ల వేణమ్మ, ఎంపిపి దర్శిగుంట శశిరేఖ, మండల ఉపాధ్యక్షులు గుమ్మడి సురేంద్ర తదితరులున్నారు.










