భారత్ అమెరికాల మధ్య రక్షణ బంధాన్ని మరింత గట్టిపర్చడం కోసం ఉద్దేశించిన బీకా ఒప్పందం జరిగిన సందర్భంలో వాటితో నిమిత్తంలేని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి సంబంధించిన అంశాలు చోటు చేసుకోవడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. మంత్రుల మధ్య చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో కొవ్వాడ అణు రియాక్టర్లకు సంబంధించిన అంశాన్ని భారత ప్రభుత్వ సమాచార శాఖ నిర్వహించే పిఐబి వెబ్‌సైట్‌లో పేర్కొనలేదు. కేవలం రక్షణ అంశాలనే ప్రస్తావించారు. విదేశాంగ శాఖ సైట్‌లో మాత్రమే ప్రకటన పూర్తి పాఠాన్ని ప్రచురించారు. భారత్‌లో ఈ అంశాన్ని మరుగు పర్చినా అమెరికా ప్రభుత్వం, అక్కడి మీడియా మాత్రం ప్రచారం చేశాయి ('మళ్లీ కొవ్వాడ!' అంటూ అక్టోబర్ 30న ప్రజాశక్తి పతాక శీర్షికతో ప్రచురించింది). ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పని చేస్తున్న కొన్ని అణు విద్యుత్ ప్లాంట్లు మూతబడుతూ, కొత్తవాటి నిర్మాణాలు ముందుకు సాగని నేపథ్యంలో 'కొవ్వాడ'పై ఎందుకింత హడావుడి అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.
విశ్లేషకులు ఇందుకు కొన్ని కారణాలను చెబుతున్నారు. అమెరికాలోని అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణ కంపెనీల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, ఆ మేరకు అక్కడి యువతలో ఈ ఎన్నికలకు ముందు ఆశ కలిగించడం ఒకటి కాగా వెస్టింగ్‌హౌస్ కంపెనీతో ట్రంప్ అల్లుడి ప్రయోజనాలు ముడివడి వున్నాయన్నది మరొకటి. అలాగే 2008 లోనే భారత అమెరికా అణు ఒప్పందం కుదిరినా అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు కనుక దాన్ని ముందుకు తేవడం ఇంకో కారణంగా చెబుతున్నారు. మిగతా దేశాలు అంగీకరించకపోయినా భారత పాలకుల్ని 'ప్రభావితం' చెయ్యగలమన్న నమ్మకంతోనే అమెరికన్లు ఈ ప్రయత్నం చేస్తున్నారని వారంటున్నారు. ఇవన్నీ అమెరికా కార్పొరేట్లకు, పాలకులకూ ప్రయోజనం కలిగించేవే! అణు విలయం సంభవిస్తే మన భూభాగంపై వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదముంది. అలాంటి ప్రమాదాల కుంపటిని తెలుగు గడ్డపై పెట్టాలని చూస్తున్న మోడీ సర్కారు కుయత్నాల పట్ల ఇక్కడి పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా వున్నాయన్నది ప్రజల సందేహం.
ప్రపంచంలో అణు విద్యుదుత్పత్తి క్రమంగా తగ్గుతోంది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలో ఈ ఏడాది జూలై నాటికి 31 దేశాల్లో 408 అణు రియాక్టర్లు మాత్రమే పని చేస్తున్నట్లు తాజాగా విడుదలైన ప్రపంచ అణు పరిశ్రమ స్థితిగతుల నివేదిక పేర్కొంది. గడచిన ఏడాది కాలంలో తొమ్మిది రియాక్టర్లు మూతపడ్డాయి. చరిత్రలో అత్యధికంగా 2002లో 438 రియాక్టర్లు విద్యుదుత్పత్తి చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 52 ప్లాంట్లు నిర్మాణంలో వుండగా 33 ప్లాంట్ల పని ప్రకటించిన షెడ్యూలు కన్నా చాలా వెనుకబడి వుంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రపంచంలో ఎక్కడా కొత్త ప్లాంటు విద్యుదుత్పత్తి ప్రారంభించలేదని నివేదిక తెలిపింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్ ఉత్పత్తి క్షీణిస్తోందని, ఇప్పటికే నిర్మిస్తున్నవి అరకొరగా తప్ప ఏ దేశమూ అణు రియాక్టర్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టడం లేదని స్పష్టమవుతోంది. అలాంటప్పుడు మనకు మాత్రం ఎందుకీ అణు కుంపట్లు ?
ప్రపంచమంతటా నేడు పారిశ్రామికోత్పత్తి, ఉపాధి కల్పన ప్రధాన చర్చనీయాంశాలుగా వున్నాయి. కొవ్వాడ అణు రియాక్టర్లపై ఒప్పందం తుది రూపు దాల్చితే వాటి తయారీ కోసం అమెరికాలో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలొస్తాయి. అంతా సజావుగా వుంటే అలా జరుగుతుంది. లేకపోతే ఈ ఎన్నికల్లో యువతకు ఆశ చూపించవచ్చునన్నది ట్రంప్ పరివారం యోచన. అంతేగాక కొవ్వాడ ప్లాంటుకు ఒప్పందం చేసుకునే వెస్టింగ్‌హౌస్ కంపెనీలో ట్రంప్ అల్లుడు జారేద్ కుష్నర్‌కు వాటాలున్నాయని మీడియా గతంలోనే పేర్కొంది. 2018లో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పంద వేగాన్ని పెంచడంలో అల్లుడి పాత్రే కీలకమని ఆనాడే కథనాలొచ్చాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మంచిదే... ఓడినా వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తినకుండా సాంకేతిక వాణిజ్య ఒప్పందం పూర్తయితే ఆ తరువాత ఎలాగోలా పని కానివ్వొచ్చన్నదీ వారి ఎత్తుగడగా పరిశీలకుల భావన. భారత అమెరికా అణు ఒప్పందంపై సంతకాలు జరిగి పన్నెండేళ్లు గడచినా అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దల్చలేదు. ఆ ఒప్పందం, దాని పర్యవసానంగా జరిగే లక్షల కోట్ల వ్యాపారం కోసం ఆ దేశంలోని బడా కార్పొరేట్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఒత్తిడి కూడా ఇప్పుడు పని చేస్తోంది.
అణు విద్యుత్ అంటేనే 'క్లీన్' పవర్ అనీ పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. అది కూడా పూర్తి నిజం కాదనీ, సౌర, పవన వంటి సంప్రదాయేతర విద్యుత్ మాత్రమే శ్రేయస్కరమని ప్రఖ్యాత సైన్స్ పత్రిక 'నేచర్ ఎనర్జీ' ఇటీవల ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. బ్రిటన్‌కు చెందిన ససెక్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 123 దేశాలకు సంబంధించిన 25 సంవత్సరాల సమాచారాన్ని విశ్లేషించి ఆ నిర్ధారణకొచ్చారు. అణు విద్యుత్ ప్లాంట్లు వున్న దేశాల్లో కర్బన ఉద్గారాలు (ఎమిషన్స్) గణనీయంగా తగ్గలేదని ఆ అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వేగంగా పెరుగుతోంది. ఉదాహరణకు న్యూజిలాండ్‌లో 2008లో 64 శాతంగా వున్నదల్లా ఇప్పటికి 82 శాతానికి చేరుకుంది. 2035 నాటికి శత శాతం సంప్రదాయేతర విద్యుత్‌నే వినియోగించాలని వారు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. పైపెచ్చు అణు విద్యుత్ ఖరీదులో దాదాపు పదో వంతుకే ఇప్పుడు సౌర విద్యుత్ లభిస్తోంది. అయినా అణు విద్యుత్ కోసం మన పాలకుల వెంపర్లాట ఎందుకో?
కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటు వల్ల అమెరికాకు, అక్కడి కార్పొరేట్లకు, పాలకులకు తప్ప మన దేశానికి, ప్రజలకూ వీసమెత్తు ప్రయోజనం లేదు. కొవ్వాడలో ప్లాంటు నిర్మిస్తే అణు ప్రమాదం సంభవించినా, సునామీ లాంటిది వచ్చినా అటు ఒడిషా మొదలు ఇటు కాకినాడ వరకూ భస్మీపటలం అవుతుందని శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలూ స్పష్టం చేస్తున్నారు. విధ్వంస కారకమైన అణు విద్యుత్ ప్లాంటు ఇక్కడ వద్దంటూ ఉత్తరాంధ్ర వాసులు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం మోడీ సర్కారుకు డూడూ బసవన్నగా వ్యవహరించింది. గుజరాత్ లోని మితివిర్ది ప్రజలు తిప్పికొట్టిన ఈ ప్రాజెక్టును తెలుగు నేలపై ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా పాదయాత్ర చేసినపుడు ఆందోళనతో వున్న ఆ ప్రాంత ప్రజలకు హాని కలగకుండా చూస్తానని హామీనిచ్చారు. కాని, అధికారానికి వచ్చాక పాత సర్కారు బాటలోనే సాగుతున్నారు తప్ప తేడా ఏమీ లేదు. కొవ్వాడ అణు ప్లాంటును వ్యతిరేకిస్తూ 'ఉత్తరాంధ్రను శ్మశానంగా మారుస్తారా?' అని గర్జించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు మౌనం దాల్చారు. కొవ్వాడ ప్లాంటు వల్ల అమెరికా వారికి, కార్పొరేట్లకు, ఎంతో కొంత ప్రయోజనం (ముడుపులందితే) ఢిల్లీ పాలకులకు తప్ప తెలుగు ప్రజలకు తీవ్ర హానికరం. సిపిఎం, వామపక్షాలు తొలి నుండీ చెబుతున్నదిదే! మోడీ సర్కారు విధానాలకు తలాడిస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు 'కొవ్వాడ'పై ఇప్పటికైనా ప్రజానుకూల వైఖరిని తీసుకోవడం అవసరం.
బి.తులసీదాస్










