Mar 19,2022 07:53
  • 6 జిల్లాల తీరంపై కీలక నిర్ణయం
  • కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూపులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలోని బీచ్‌సాండ్‌ లీజులను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. తీరం వ్యాప్తంగా ఉన్న ఆరు జిల్లాల్లోని ఖనిజాలపై బాధ్యతను ఎపిఎండిసికి అప్పగించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల బీచ్‌సాండ్‌పై ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ నిర్ణయాలను అమలు చేసేందుకుగాను కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపించారు.
     ప్రస్తుతం బీచ్‌ సాండ్‌లోని కొన్ని అణుధార్మిక ఖనిజంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదని అధికారులు అంటున్నారు. గతంలో కొన్ని ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్రం తాజా ప్రతిపాదనల ఫైలును పెండింగ్‌లో ఉంచినట్లు తెలిసింది. అందుకే ఎపిఎండిసికి అప్పగించాలన్న నిర్ణయం అమలులోకి రాలేదని సమాచారం.
    రాష్ట్రంలోని కీలకమైన కొన్ని ఖనిజాల తవ్వకాల బాధ్యతను జై ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు అప్పగించడం గమనార్హం. మేజర్‌ ఖనిజాలుగా గుర్తింపు పొందిన మాంగనీస్‌, ఐరన్‌ఓర్‌, లైమ్‌స్టోన్‌ ఖనిజాల తవ్వకాలను ఈ సంస్థకు అప్పగించారు. వీటిపై ప్రకటించిన బిడ్లలో ఈ సంస్థే అత్యధిక మొత్తానికి దాఖలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకటో ప్యాకేజిలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు, రెండో ప్యాకేజీ కింద పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, మూడో ప్యాకేజీగా నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను గుర్తించారు. దీనికోసం వరుసగా రూ.477 కోట్లు, రూ.746 కోట్లు, రూ.306 కోట్లకు ఈ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. ఈ సంస్థే గతేడాది మే నెల నుంచి రాష్ట్రంలోని ఇసుక తవ్వకాల బాధ్యతను కూడా నిర్వహిస్తుంది. తన వ్యక్తిగత యాప్‌ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేరుగా నిర్వహిస్తుండగా, త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా నిర్వహణ ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.