Feb 02,2023 21:57

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సవితమ్మ

ప్రజాశక్తి -పెనుకొండ : స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ ఆస్తులపై బహిరంగచర్చకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ సవాల్‌ విసిరారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవితమ్మ మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర నారాయణ మాట్లాడిన తీరును చూస్తుంటే 2024లో ఆయనకు వైసిపి తరపున టికెట్‌ రాదని తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ భయంతోనే తమ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్‌ మీద, తన వ్యాపారాల మీద లేనిపోని వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు చూస్తుంటే 'దయ్యాలు వేదాలు వల్లించినట్లు' ఉందన్నారు. తాను పక్కా లోకల్‌ అని తన నా వ్యాపారాలు పక్కా లీగల్‌ అని అన్నారు. తన వ్యాపారాలు కొత్తగా వచ్చినవి కాదని 20 సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నానని చెప్పారు. ఏరోజూ ఒక్క అవినీతి మరక లేదని అన్నారు. శంకరనారాయణ ఎమ్మెల్యే కాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఆ ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని శంకర నారాయణకు బహిరంగ సవాల్‌ చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే సోదరుల అవినీతి గురించి వైసీపీ నాయకులే బహిరంగంగా చెప్తున్నారని ఆరోపించారు.బీసీ సంక్షేమ శాఖమంత్రిగా పనిచేసిన శంకరనారాయణ బిఎసిలకు చేసింది ఏమీ లేదని అన్నారు. అంతేకాకుండా ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రిగా పని చేసిన ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూపించాలని సవాల్‌ చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తన వ్యాపారాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటరమణ, శ్రీరాములు, ఆంజనేయులు, ప్రసాద్‌, నరసింహులు, గోపాల్‌, త్రివేంద్ర నాయుడు, మావుటూరు గోపాల్‌, కౌన్సిలర్‌ గీతా హనుమంతు, వాసుదేవ రెడ్డి, మంజు, రామాంజి, తదితరులు పాల్గొన్నారు.