న్యూఢిల్లీ : 'పెగాసస్'ను 'మిలటరీ గ్రేడ్' నిఘా సాఫ్ట్‌వేర్‌గా పేర్కొంటారు. స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లలో దీనిని రహస్యంగా ప్రవేశపెడతారు. అక్కడ్నుంచీ వాటిని వాడే వ్యక్తులపై నిఘా కొనసాగుతుంది. సాధారణంగా దీనిని ఉగ్రవాద చర్యలు, దేశ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి వాడాలి. కానీ భారత్‌లో మోడీ సర్కార్ దేశ ప్రజలపైనే ప్రయోగించింది. ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై పెగాసస్‌ను ప్రయోగించిందని 'ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ కన్సార్టియం' ఆధారాలు సేకరించింది.
దీనికి సంబంధించిన వివరాల్ని మనదేశంలో న్యూస్ వెబ్ పోర్టల్ 'ద వైర్' విడుదల చేసింది. మోడీ సర్కార్ పెగాసస్‌తో దాదాపు 300మందిపై నిఘా చర్యలకు పాల్పడిందని 'ద వైర్' గత ఏడాది వార్తా కథనం ప్రచురించింది. ఇది దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఆరోపణల్ని కేంద్రం తోసిపుచ్చింది. ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. అటు తర్వాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ నిమిత్తం ముగ్గురు సభ్యులతో స్వతంత్ర కమిటీని సుప్రీం ఏర్పాటుచేసింది.
ఎన్‌ఎస్‌వో గ్రూప్ దాదాపు ఓ దశాబ్దం నుంచి నిఘా సాఫ్ట్‌వేర్‌ను సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికపై ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వెర్షన్ ఏదైనప్పటికీ దానిలోని సమాచారాన్ని నమ్మకంగా తెలుసు కోగలుగుతుందని హామీ ఇస్తోంది. ఇదిలా ఉండగా, పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనాన్ని కేంద్రం తోసిపుచ్చింది. ఆరోపణలకు సరైన ప్రాతిపదిక లేదని కొట్టిపారేసింది.
అయితే గత సంవత్సరం అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్ర నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. భారతదేశంలో నిర్దిష్టంగా కొందరు వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దేశ భద్రత అనే బూచిని చూపిన ప్రతిసారీ ప్రభుత్వానికి మార్గం సుగమం కాబోదని స్పష్టం చేసింది. ఈ బూచిని చూపినంత మాత్రాన న్యాయ వ్యవస్థ మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది.










