- కర్నూలులో నోటీసులు
- అద్దెదారులపై విద్యుత్ పెనుభారం
- ముందే చెప్పిన ప్రజాశక్తి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/ఆదోని, అమరావతిబ్యూరో : ఒక ఇంటికి ఒకే మీటరు నిబంధనను విద్యుత్‌శాఖ గుట్టుచప్పుడు కాకుండా అమలులోకి తీసుకువస్తోంది. కర్నూలు జిల్లాల్లో ఒక మీటరు కన్నా అదనంగా ఉన్న పలువురు వినియోగదారులకు ఆ శాఖ నుండి నోటీసులు అందాయి. డిపార్టుమెంటు నిబంధనల ప్రకారం ఒకే మీటరు ఉండాలని, అదనంగా ఉన్న మీటర్లను వారం రోజుల్లోగా రద్దు చేసుకోవాలని, అలా రద్దు చేసుకోకపోతే ఎటువంటి నోటీసులు లేకుండా ఆ ఇంటికి ఉన్న అన్ని సర్వీసుల కనెక్షన్లను తొలగిస్తామని ఈ నోటీసుల్లో అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములేని పిడుగులాగా విద్యుత్ శాఖ అధికారుల నుండి అందుతున్న ఈ నోటీసులు ప్రజానీకంలో కలకలం రేపుతున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రజానీకంపై ముఖ్యంగా అద్దెదారులపై పెను భారం పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయనుందని నవంబర్ 29వ తేదినే ప్రజాశక్తి వార్తా కథనాన్ని ప్రచురించింది. 'సర్వే షాక్' శీర్షికతో ప్రచురితమైన ఈ కథనంలో నివాస గృహాలకు ఒకే యజమాని పేరుతో ఉన్న మీటర్లపై సర్వేచేసి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరించిందని, త్వరలోనే ఒక ఇంటికి - ఒకే మీటర్ విధానాన్ని అమలు చేయనుందని పేర్కొంది. ఇప్పుడు ఆ కథనమే నిజమైంది. ఈ విధానం ద్వారా 4 వేల కోట్ల రూపాయలకుపైగా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలన్నది విద్యుత్‌శాఖ ఆలోచన అని సమాచారం. అదనపు మీటర్లు రద్దు చేసుకోవాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులు కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చినప్పటికీ, మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే తరహా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.
('సర్వే షాక్' వార్తను ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు)
కర్నూలులో ఇలా...
కర్నూలు నగరంలోని డి1 సెక్షన్‌లో 206, డి2 సెక్షన్‌లో 278, ఆదోని పట్టణంలోనిడి3 సెక్షన్‌లో 268, నంద్యాల డి1 సెక్షన్‌లో 261, నందికొట్కూరులో 104 కనెక్షన్లతో కలిపి జిల్లా వ్యాప్తంగా 1,117 కనెక్షన్లలలో ఒకటి కన్నా ఎక్కువ మీటర్లు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో అధికారులు గుర్తించారు. వీటిలో దాదాపు 50శాతం ఇళ్లకు తాజాగా నోటీసులు అందాయి. దీంతో ప్రజానీకంలో గగ్గోలు ప్రారంభమైంది. మరోవైపు జిల్లా అంతటా విస్తృతంగా సర్వే చేసి. మరింత మందికి నోటీసులు జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదోని పట్టణంలో 268 గృహ సముదాయాలను గుర్తించి ఒకటి కంటే ఎక్కువ ఉను విద్యుత్ మీటర్లను తొలగించాలని నోటీసులు జారీ చేశామని ఆదోని ట్రాన్స్‌కో ఎడిఇ పురుషోత్తం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.
ఐదు పోర్షన్లుంటేనే బోరుకు మీటరు
ఇంటి ప్రాంగణంలో ఐదు పోర్షన్ల కంటే ఎక్కువ ఉంటేనే బోరుకు ప్రత్యేక మీటరు ఇవ్వాలని కూడా విద్యుత్ శాఖ నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో అలాంటి ఇళ్లకు నోటీసులిచ్చే ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. గతంలో ఒక గృహ సముదాయంలో రెండు కంటే ఎక్కువ పోర్షన్లు ఉంటే బోరుకు ప్రత్యేక మీటరు బిగించుకునేందుకు అవకాశముండేది. ప్రసుత్తం ఆ అవకాశం లేదు. అలానే లిఫ్టు తదితర వాటికి ఇక నుంచి ప్రత్యేకంగా మీటర్లు బిగించుకునేందుకు వీలు లేకుండా పోయింది. బోరు, ఇంటికి ఒకటే మీటరు ఉంటే టారీఫ్ మారి బిల్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
ప్రక్రియను విరమించుకోవాలి
ఇంటి మీటర్ల తగ్గింపు ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి. లేనియెడల ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ప్రజలపై ఇప్పటికే అనేక రకాల భారాలు పడుతున్నాయి. ప్రజలకు నిత్యావసరంగా ఉను విద్యత్ వినియోగంలో భారం మోపడం తగదు. మీటర్ రీడింగ్ పెరిగి టారీఫ్ మార్పు చెంది వేలాది రూపాయాలు వినియోగదారులపై భారం పడుతుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పాలి.
- లక్ష్మణ్, వినియోగదారుడు ఆదోని.
నోటిసులను ఉపసంహరించుకోవాలి
ఒకే విద్యుత్ మీటర్ ఉండాలనిఅధికారులు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలి. కరోనా వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతును తరుణంలో మరిన్ని భారాలు మోపడం సరికాదు. బడా పారిశ్రామికవేత్తలను వదిలేసి సామాన్యులపై భారాలు మోపితే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది.
- ఇ.పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు.










