- ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్
- అధికారుల దృష్టికి పంచాయతీరాజ్
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఏళ్ల తరబడి పని చేస్తున్నా, ఒక్క పైసా వేతనం పెరగకపోవడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు (కంప్యూటర్ ఆపరేటర్లు) ఆవేదన చెందుతున్నారు. పంచాయతీరాజ్‌శాఖలోని జడ్‌పి, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో సుమారు 600 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆప్కాస్‌లో చేర్చలేదు. దీంతో వీరికి రెండు, మూడు నెలల కోసారి వేతనాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్‌శాఖలోని కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.15 వేలు వేతనమే చెల్లిస్తున్నారు. వీరికి ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం లేదు. రెవెన్యూ సహా పలు శాఖల కంప్యూటర్ ఆపరేటర్లను ఆప్కాస్‌లో చేర్చారని, తమను కూడా ఆప్కాస్‌లో చేర్చాలని ఎప్పట్నుంచో కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నా, సాంకేతిక కారణాలు చూపుతూ ఆప్కాస్‌లో చేర్చడం లేదని వాపోతున్నారు. ఇటీవల మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు పంచాయతీరాజ్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేశారు. అందరితోపాటు తమనూ ఆప్కాస్‌లో చేర్చి, కొత్త పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.
అనంతరం పంచాయతీరాజ్ కమిషనరేట్ అధికారులతో సమస్యలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాన్ని చెల్లించడంతోపాటు ఆప్కాస్‌లో చేర్చాలని వారు కోరారు. వీటిపై అధికారులు స్పందిస్తూ... కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఆప్కాస్‌లో చేర్చేందుకు కొత్త బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్లుగా రెండు, మూడు పంచాయతీల్లో పని చేస్తుండటంతో, వేతనాల చెల్లింపు విషయంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.










