మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ క్రమంలో అత్యంత అధ్వాన్నమైన కోణాలు ఇప్పుడు నెమ్మదిగా తెరపైకి వస్తున్నాయని పీపుల్స్ డెమొక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. దేశ ఆర్థిక రంగంలో మకుటాయమానమైన జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసి)లో వాటాలను ఉపసంహరించుకునేందుకు ఫిబ్రవరి ప్రారంభంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)లను జారీ చేస్తారని భావిస్తున్నారు. దేశంలో జీవిత బీమా సంస్కృతిని వ్యాప్తి చేయడంలో మార్గదర్శక పాత్ర పోషించిన ఎల్‌ఐసి ఒక విశిష్టమైన సంస్థ. ప్రజలకు ముఖ్యంగా పేదలకు, బలహీనవర్గాలకు రక్షణ కల్పించేందుకు సమర్ధవంతమైన, ప్రభుత్వ తోడ్పాటు కలిగిన సామాజిక భద్రతా పథకాలు లేనపుడు ఎల్‌ఐసి ద్వారా విస్తృతంగా జీవిత బీమాను సాధించడానికి ఉపయోగపడింది.
ఎల్‌ఐసిది విలక్షణమైన నిర్మాణం. సామాన్యులకు కూడా బీమాను అందచేయగల వీలు వున్నది. ఇందులో ప్రధమ పెట్టుబడిదారైన ప్రభుత్వానికి లభించే లాభాలు కేవలం ఐదుశాతానికే పరిమితమవుతాయి, మిగిలిన 95శాతం లాభాలు పాలసీదారులకే అందుతాయి. ఒకవేళ పెట్టుబడులను ఉపసంహరిస్తే ఈ శాతం 90 శాతానికి తగ్గుతుంది. ఆ రకంగా, ఇతర కంపెనీల మాదిరిగా కాకుండా, ఎల్‌ఐసి పెద్ద మొత్తంలో లాభాలను వాటాదారులకు కాకుండా పాలసీదారులకే కేటాయించింది. 1956లో ఎల్‌ఐసిని ఏర్పాటు చేశారు. ఏ లక్ష్యంతో అయితే దీన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది. విస్తృత సంఖ్యలో ప్రజలకు బీమాను అందించింది. ''ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రజలకు బీమాను అందించింది.''
బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీలను అనుమతించిన తర్వాత కూడా జీవిత బీమా వ్యాపారంలో ఎల్‌ఐసి తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిగింది. జీవిత బీమా పాలసీలు జారీ చేయడంలో ఎల్‌ఐసి మార్కెట్ వాటా దాదాపు అన్ని జీవిత బీమా పాలసీలకు కలిపి నాలిగింట మూడువంతులు వుంటుంది. 2020-21లో ఎల్‌ఐసి రూ.3.03 లక్షల కోట్ల ప్రధాన ఆదాయాన్ని ఆర్జించింది. 40కోట్ల మంది పాలసీదారులు వున్నారు. ఎల్‌ఐసి ఏర్పడినప్పటి నుండి రూ.28,695 కోట్లు మేరకు ప్రభుత్వానికి డివిడెండ్లు చెల్లించింది. బ్యాంకుల్లో, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో గణనీయమైన మొత్తాల్లో పెట్టుబడులు పెట్టింది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక రంగ పథకాలకు తన వంతుగా ఎల్‌ఐసి పెద్ద మొత్తాలను అందించింది. 2020-21లో, ఇలా అందించిన మొత్తాలు రూ.26,322 కోట్లుగా వున్నాయి.
ఇంతటి విశిష్టిమైన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసిని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఇప్పుడు ద్వారాలు తెరుస్తున్నారు. ఇందుకు దేశ, విదేశీ సంస్థలను అనుమతిస్తున్నారు. ఎల్‌ఐసి ఐపిఓలను జారీ చేసేందుకు వీలుగా 2021-22 ఫైనాన్స్ బిల్లు ద్వారా ఎల్‌ఐసి చట్టాన్ని సవరించారు. వచ్చే దశాబ్దంలో ప్రైవేటు పెట్టుబడులు గణనీయంగా పెరిగేందుకు తన ఈక్విటీని తగ్గించుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మొదటి ఐపిఓ జారీ చేసినప్పటి నుండి వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ వాటా 75 శాతానికి తగ్గుతుంది. ఆ తర్వాత తాము 51 శాతం వాటా అట్టి పెట్టుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఎల్‌ఐసి స్వభావం తీవ్రంగా మారుతుంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ద్వారా నిర్దేశించబడిన సామాజిక సంక్షేమ లక్ష్యాల నుండి దూరంగా జరిగేందుకు దేశ, విదేశీ ప్రైవేటు పెట్టుబడిదారులు ఎల్‌ఐసిపై ఒత్తిడి తీసుకురావడం ఆరంభిస్తారు.
ప్రభుత్వ రంగం, ప్రజా సేవలపై పీపుల్స్ కమిషన్ ఎల్‌ఐసి ఐపిఓపై తన నివేదికలో ఇలా పేర్కొంది. ''ఎల్‌ఐసిని లిస్టింగ్ జాబితాలో పెట్టడం, దాన్నుండి వాటాలను ఉపసంహరించడం వల్ల సమాజంలోని వెనుకబడిన వర్గాల సామాజిక భద్రతా సేవలను అందించే సంస్థగా ఎల్‌ఐసి పాత్ర తీవ్రంగా మారిపోతుంది. ఇబ్బడిముబ్బడిగా లాభాలను కోరుకునే పెట్టుబడిదారులకు అనుకూలంగా, లక్షలాదిమంది తన చిన్న పాలసీదారులు పోషించే ప్రాధాన్యత గల పాత్రను నీరుగార్చేస్తుంది. పరోక్షంగా, పెద్ద మొత్తంలోని నిరుపేద కుటుంబాల పొదుపు మొత్తాలపై నియంత్రణను దేశ విదేశీ పెట్టుబడిదారులతో సహా ప్రైవేటు వ్యక్తులకు అనాలోచితంగా అప్పగించడమే అవుతుంది.'' అని హెచ్చరించింది. ఎల్‌ఐసి ఐపిఓకు విలువ కట్టే పద్ధతి, క్రమాన్ని పబ్లిక డొమైన్‌లో పెట్టకుండా రహస్యంగా వుంచారు. ఎల్‌ఐసి విలువను రూ.15లక్షల కోట్లుగా లెక్కించినట్లు తెలుస్తోంది. పైగా దీని ఎంబెడెడ్ వాల్యూని నాలుగు లక్షల కోట్ల రూపాయిలుగా లెక్కించడం పూర్తిగా ఘోరమైన తప్పుడు అంచనాలే. ఇలా విచిత్ర రీతిలో ప్రభుత్వ రంగ ఆస్తులకు తక్కువ విలువ కడుతూ, ప్రైవేటు పెట్టుబడిదారులకు చవకగా అమ్మేస్తున్నారు. ఈ రకంగా ఎల్‌ఐసి ఐపిఓ అనేది బడా ప్రైవేటు శక్తులకు పెద్ద లాభాలను తెచ్చిపెట్టే వరాల మూట గానుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్‌ఇ) ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన కుంభకోణం ఇటీవల విక్రయించిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సిఇఎల్) విషయంలో చాలా స్పష్టంగా ప్రదర్శితమైంది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో ఈ కంపెనీ పనిచేసేది. మెస్సర్స్ నందలాల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ సిఇఎల్‌ను రూ.210కోట్లకు విక్రయించారు. సోలార్ సెల్స్, సోలార్ ప్లాంట్లు, రైల్వే సిగలింగ్ వ్యవస్థలు, రక్షణ రంగ ఉత్పత్తులు వంటి వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్‌ను అభివృద్ధిపరచడంలో సిఇఎల్ కంపెనీ మార్గదర్శక పాత్ర పోషించింది. అటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థని ద్వంద్వ ప్రమాణాల రికార్డు కలిగిన ఒక ట్రేడింగ్ కంపెనీకి విక్రయించారు. పైగా ఆ కంపెనీకి ఎలాంటి నిర్దిష్ట ఆస్తులు లేవు, సాంకేతిక రంగంలో కానీ, సాంకేతిక సంస్థల నిర్వహణలో కానీ ఆ కంపెనీకి పోటీ పడే తత్వం లేదు. సిఇఎల్‌కి వున్న 50ఎకరాల భూమి మార్కెట్ విలువే ప్రస్తుతం రూ.440కోట్లు వుంది. 2021 ఆర్థిక సంవత్సరంలోనే రూ.124కోట్ల స్థూల లాభాలను ఆర్జించింది. ఇంతటి కుంభకోణాలతో కూడిన విక్రయంపై రేగిన ప్రజాగ్రహంతో ఈ సంస్థని సదరు కంపెనీకి అప్పగించడాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుచేయాల్సి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసి, జాతీయాస్తులన్నింటినీ దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టాలన్న మోడీ ప్రభుత్వ ప్రణాళిక, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని తుడిచిపెట్టే, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి సంబంధించి రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అణచివేసే ప్రమాదకరమైన ప్రణాళిక కాగలదు. దశాబ్దాల తరబడి నిర్మించుకున్న ప్రభుత్వ ఆస్తులు, వనరులను లూటీ చేయడానికి మార్గం సుగమం చేయడమే కాగలదు. ఎల్‌ఐసిని, ప్రభుత్వ రంగాన్ని ఇలా నాశనం చేయడాన్ని తక్షణమే నిలుపు చేయాలి. ఈ దాడిని ప్రతిఘటించేందుకు అన్ని ప్రజాతంత్ర, దేశభక్తియుత శక్తులను విస్తృత రీతిలో సమీకరించాలి. ఎల్‌ఐసి, సాధారణ బీమా, జాతీయ బ్యాంకుల ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట పథాన సాగుతున్నారు. ఈ పోరాటాన్ని మరింత విస్తరించాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కార్మికులు, ఉద్యోగులందరినీ కలుపుకుని పోరాడాలి. కార్మిక వర్గ ఐక్య పోరాటంలో భాగం కావాలి. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యలు పిలుపిచ్చిన రెండు రోజుల అఖిల భారత సార్వత్రిక సమ్మె ఈ పోరాటంలో కీలకమైన దశ కావాలి.










