నగరాలు, పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంపు, పౌర సేవలపై వినియోగ ఛార్జీల ఇబ్బడి ముబ్బడి వసూళ్లు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు రాదలచిన మున్సిపల్ చట్ట సవరణ ప్రజల నెత్తిన మోదుతున్న అదనపు ఆర్థిక బండ. మాంద్యం, కరోనా సంక్షోభ సమయాన బతుకులు అసలే అస్తుబిస్తుగా సాగుతున్న పుర ప్రజలకు గోరుచుట్టుపై రోకలి పోటు. ప్రజలను కాల్చుకుతినే బిల్లుపై ఆగమేఘాల మీద ఇంతకుముందే ఆర్డినెన్స్ జారీ చేసిన వైసిపి సర్కారు, ఇప్పుడు వాటికి చట్ట రూపం కల్పించేందుకు శీతాకాల అసెంబ్లీలో ఆమోదానికి ప్రతిపాదించింది. శాసనసభలో అధికార పక్షానికి తిరుగులేని మెజార్టీ ఉన్నందున బిల్లు సునాయాసంగా నెగ్గింది. మండలిలో ప్రభుత్వ పక్షానికి బలం లేక, పిడిఎఫ్, టిడిపి వ్యతిరేకించినందున బుధవారం వీగిపోయింది. పెద్దల సభ తిరస్కరించిన బిల్లుపై సర్కారు కనీసం పునరాలోచన చేయకుండా, తనకున్న 'బలం'తో మర్నాడే శాసనసభలో రెండోసారి ఆమోదింపజేసుకుంది. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలపై అదనపు భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. కేంద్రంలోని బిజెపి సర్కారును సంతృప్తిపర్చేందుకు, కొద్దిపాటి నిధుల కోసం అది పెట్టిన షరతులకు వైసిపి ప్రభుత్వం తలొగ్గింది. ఎన్నుకున్న ప్రజల కంటే కార్పొరేట్ అనుకూల కేంద్ర కుసంస్కరణలకే విలువనిచ్చింది.
కరోనా నేపథ్య ఆర్థిక సంక్షోభ ఉపశమనానికంటూ మోడీ సర్కారు తెచ్చిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ అమ్ములపొది లోనిదే మున్సిపల్ చట్ట సవరణ. 'సంస్కరణ'ల అమలుకు బిజెపి, ఎన్‌డిఎ పార్టీ పాలిత రాష్ట్రాలు సైతం ఆలోచనలో పడగా వైసిపి ప్రభుత్వం సై అంటోంది. ఇప్పటికే రైతుల ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగిస్తోంది. ఇప్పుడు పుర ప్రజలపై పన్నుల భారానికి ఒడిగట్టింది. చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకొస్తే అర్బన్ ప్రజానీకానికి పన్నులు పెను భారం అవుతాయి. ఇప్పటి వరకు ఇంటి అద్దెల ప్రాతిపదికన ఇంటి పన్నులుండగా ఇక ఆస్తి విలువ ప్రామాణికంగా ప్రతి ఏడాదీ ట్యాక్స్‌లు వేస్తారు. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రాపర్టీ విలువ పెరిగితే ఆ మేరకు పన్ను పెరుగుతుంది. అపార్టుమెంట్లు, వాణిజ్య కట్టడాలపై పన్నుల మోత మోగుతుంది. ఖాళీ స్థలాలు, డి-ఫాం పట్టాలు, పేదల ఆక్రమణలు వేటినీ వదిలిపెట్టరు. పెనాల్టీలు, అపరాధ రుసుంలు సైతం వేస్తారు. పేదల నుండి రూ.50 మాత్రమే తీసుకుంటామని, 15 శాతమే పెరుగుతాయని సర్కారు చెప్పే వివరణలకు విలువ లేదు. చట్టంలో అవేమీ లేవు. స్థానిక ఎన్నికల తతంగం కాస్తా ముగిసిన వెంటనే అనేక రెట్లు పన్నులు వేయడం ఖాయం.
మున్సిపల్ చట్ట సవరణలోనే తాగునీరు, డ్రైనేజి, పారిశుధ్యం తదితర పౌర సేవలకు యూజర్ ఛార్జీలను ప్రజల నుంచి గోళ్లూడగొట్టి పిండుకొనే దారుణం దాగుంది. నిర్వహణ ఖర్చుల మొత్తాన్నీ ప్రజల నుంచి రాబట్టేందుకు జీవోలు విడుదలయ్యాయి. ప్రజలకు ప్రభుత్వం ఏదీ ఉచితంగానో, రాయితీపైనో ఇవ్వదు. అన్నీ కొనుక్కోవాలి. ప్రతిదీ వ్యాపార సరుకుగా మారిపోతుంది. కార్పొరేట్లు లాభాలు పోగేసుకుంటారు. ఇప్పటికే గ్రామాల్లో చెత్తపై పన్ను మొదలైంది. 73,74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థలను స్వయంపాలితాలుగా పేర్కొన్నాయి. పన్నుల నిర్ణయం స్థానిక సంస్థలకే దఖలు పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు నిర్ణయించడం అధికార వికేంద్రీకరణ స్ఫూర్తికి విరుద్ధం. పన్నుల పెంపుపై పుర ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా బిల్లులను ఏకపక్షంగా పాస్ చేసుకోవడం ప్రభుత్వానికి తగనిపని. చట్టసభలో మెజారిటీ వుంటే చాలదని, ప్రజామోదం పొందడం చాలా అవసరమని జగన్ ప్రభుత్వం గుర్తించాలి. కట్టలు తెంచుకున్నాక ప్రజాగ్రహం ఏ తీరున వ్యక్తం అవుతుందో దేశ రాజధానిలో రైతన్నలు సాగిస్తున్న ఉద్యమం చూస్తే బోధపడుతుంది. జగన్ ప్రభుత్వపు ఏకపక్ష చర్యలు ప్రజాగ్రహం చవిచూడక తప్పదు.










