'మనమూ ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాలి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు మారాలి. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆనందంగా వెళ్లాలి. అలా ఎగురుతుంటే ఎంత బాగుంటుంది. ఆ ఆనందాన్ని చెప్పటం కన్నా అనుభవిస్తేనే మజాగా ఉంటుంది' అనే వింత ఆలోచన ఒకరోజు అడవిలోని జంతువులకు వచ్చింది. అన్నీ ఒకేచోట సమావేశమయ్యాయి. 'ఎప్పుడూ అడవిలో కాళ్ళతో నడవటం, పరిగెత్తటం విసుగు పుడుతుంది. ఎలాగైనా పక్షుల్లాగా ఆకాశంలోకి సరదాగా ఎగరాలి' అని కొన్ని జంతువులు అన్నాయి. ఈ విషయంలో జంతువులన్నీ మూడు వర్గాలుగా విడిపోయాయి. ఒకవర్గం జంతువులు 'మనకు పక్షుల్లా రెక్కల్లేవు గనుక ఎగరలేము. ఇది పిచ్చి ఆలోచన' అన్నాయి. రెండో వర్గం జంతువులు 'మనల్ని నేల మీద బతకమని రాసి ఉంది. ఈ జన్మకు మన బతుకులు అడవిలోనే ముగిసిపోవాలి' అని అన్నాయి. మూడోవర్గం జంతువులు 'మీరందరూ చెప్పేది తప్పు. ఒకసారి ఎలా ఎగరాలో ప్రయత్నించి చూద్దాం. విఫలమైతే మానుకుందాం. మానవుడు ఎన్నో కొత్తవి కనిపెట్టాడు. మరెన్నో విజయాలు సాధించాడు. ఆఖరికి రెక్కలు లేకుండా అంతరిక్షంలోకి పోలేదా?' అని ప్రశ్నించాయి. చివరకు అన్ని జంతువులు ఒకసారి ప్రయత్నిద్దామని తీర్మానించుకున్నాయి.
ముందుగా ఎలా ఎగరాలో పక్షులను చూసి, నేర్చుకోవాలని అనుకున్నాయి. సమీపంలోని చెరువు దగ్గరకు పక్షులు రోజూ వస్తుంటాయని తెలుసుకుని, జంతువులన్నీ అక్కడకు బయలుదేరాయి. అక్కడ పక్షులన్నీ చేపలను వేటాడుతున్నాయి. జంతువులన్నీ పక్షులకు కనబడకుండా చెట్ల చాటున నిలబడి గమనిస్తున్నాయి. మొదటగా పక్షులు చెరువు పైన ఎగరటం చూశాయి. ఆ తర్వాత నీటిలోంచి చేపలు బయటకు రాగానే రెండు కాళ్లతో గట్టిగా పట్టుకొని, పక్కనే ఉన్న ఎత్తయిన కొండల పైకి చేరుకునేవి. అక్కడ తమ ముక్కుతో చేపలను చంపి, తిన్న తర్వాత ఆకాశంలోకి వచ్చిన దారినే ఎగిరిపోయేవి. జంతువులన్నింటికీ ఒక ఆలోచన వచ్చింది. ఆ కొండకు ఏదో శక్తి ఉంది. అందుకే పక్షులన్నీ కొండ మీద నుంచి ఎగరగలుగుతున్నాయని అవి భావించాయి. మనం కూడా పక్షుల్లా ఆ కొండపైకి చేరుకుంటే తేలికగా ఆకాశంలోకి ఎగరొచ్చని నిర్ణయించుకున్నాయి. ఇంకేముంది జంతువులన్నీ శ్రమైనా ఎగరాలనే ఆశతో కొండ మీదకు చేరుకున్నాయి. 'అందరం ఒకేసారి పక్షుల్లా గాల్లోకి ఎగరాలి... కొత్త కాబట్టి ఒకరి చేతులు ఒకరం గట్టిగా పట్టుకొని ఎగురుదాం అంటూ కళ్లు మూసుకుని, గాల్లోకి ఎగిరేందుకు ప్రయత్నించాయి' జంతువులు. అవి గాల్లోకి ఎగరలేదు సరికదా.. కొండ పై నుంచి నేలపై పడటంతో పాపం వాటికి దెబ్బలు తగిలాయి. కొన్ని జంతువులు పడిన చోటునే లేవలేక మూలగసాగాయి. ఇంతలో ఒక జంతువు మన అందరి తిక్క కుదిరింది. 'ఈ సృష్టిలో ఎవరు ఎక్కడుండాలి? ఏం పని చేయాలి? అనేది ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. అందుకే మనుషులు ''కుక్క పని కుక్క చెయ్యాలి.. గాడిద పని గాడిద చెయ్యాలి'' అన్నారు. ఒకరి పని మరొకరు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది' అని అంది. మిగతా జంతువులు కూడా బుద్ధి వచ్చిందంటూ కుంటుతూ... మూలుగుతూ అడవి బాట పట్టాయి.
తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర
94923 09100