ప్రజాశక్తి-విజయవాడ
దళిత మహిళా వార్డెన్‌ను కులం పేరుతో దూషించి, లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి (ఎఎస్‌డబ్ల్యుఒ) గోపాలకృష్ణను ను వెంటనే అరెస్టుచేసి,కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఎఎస్‌డబ్ల్యుఒ పై చర్య తీసుకోవాలని కోరుతూ కెవిపిఎస్, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఎఎస్‌డబ్ల్యుఒపై చర్య తీసుకోవాలని, దళిత మహిళా వార్డెన్ బదిలీని నిలుపుదల చేయాలని, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ...దళిత మహిళా వార్డెన్‌ను వేధింపులకు గురి చేసిన ఎఎస్‌డబ్ల్యుఒ గోపాలకృష్ణ వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఏకపక్షంగా సోషల్ వెల్ఫేర్ డి డీ విజయభారతి ఇచ్చిన తప్పుడు రిపోర్ట్‌ను సమగ్రంగా పరిశీలించకుండా, వేదింపులకు గురయిన వార్డ్‌న్‌ను బదిలీ చేయటం చాలా అన్యాయమన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కె శ్రీదేవి మాట్లాడుతూ దళిత మహిళా వార్డెన్‌ను అన్ని రకాలుగా వేధింపులకుగురి చేసిన ఎఎస్‌డబ్ల్యుఒపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.కవిపిఎస్ ఎన్‌టిఆర్ జిల్లాకార్యదర్శి జి నటరాజు, ఐద్వా సెంట్రల్ సిటీ కార్యదర్శి జి ఝాన్సీ, మాజీ కార్పొరేటర్ జి గాదె ఆదిలక్ష్మీ , ఎస్‌కె ఆషా, ఎస్‌కె షకీలా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు సోమేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా నాయకులు తాళ్లూరి నరసింహారావు, డాక్టర్ అంకయ్య, మహిళలు పాల్గొన్నారు.










