నిర్దేశించిన షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే పార్లమెంటు సమావేశాలను ముగించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. జూన్ 19న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి అర్ధాంతరంగా స్వస్తి వాక్యం పలికిన బుధవారం వరకు ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్యపై కూడా ఉభయసభల్లో చర్చ జరగలేదు. ఓబిసిల రిజర్వేషన్లకు సంబంధించిన చట్ట సవరణ బిల్లు ఒక్కటే దీనికి మినహాయింపు! వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి తీరాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయంపైనా, పెగాసస్ స్పైవేర్‌తో చేసిన నిఘా నికృష్టపు చర్యలపైనా చర్చ జరిగి తీరాలన్న ప్రతిపక్షాల డిమాండ్లను కేంద్రం సమావేశాల ప్రారంభపు రోజు నుండి పెడచెవిన పెట్టింది. ఏ దశలోనూ వీటిపై చర్చకు అనుమతించలేదు. వాయిదా తీర్మానాలతో పాటు, వివిధ రూపాల్లో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాలపై చర్చకు ప్రయత్నాలు చేసినప్పటికీ మోడీ సర్కారు మోకాలడ్డింది. దీంతో ప్రతిష్టంభన అనివార్యమైంది. దీనిని అవకాశంగా తీసుకున్న కేంద్రం ఉభయసభలను వాయిదాల బాట పట్టించింది. దీనికి ప్రతిపక్షాలనే కారణంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని అడుగడుగునా చేసింది. అదే సమయంలో లోక్‌సభలో 20 బిల్లులను ఆమోదింపచేసుకుంది. బిల్లుల ఆమోదానికి అడ్డుకాని నిరసనలు సభ నిర్వహణకు, ప్రజా సమస్యలపై చర్చకు ఎలా అడ్డు అయ్యాయో? పైగా విలువైన సమయాన్ని వృధా చేశారని, సంప్రదాయాలను పాటించలేదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు! నిరసనల మధ్యే ఏమాత్రం చర్చ లేకుండా ఒకదాని తరువాత ఒకటిగా బిల్లులను ఆమోదించుకుంటూ పోవడం ఎక్కడి సాంప్రదాయం? ఈ ఏకపక్ష ధోరణికి నిరసనగా విపక్షం ఏకతాటిపై నిలిచి వాకౌట్ చేసిన తరువాత రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు.
నిజానికి దేశ ఆహారభద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించే కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతాంగం చేపట్టిన ఆందోళన కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి జంతర్‌మంతర్ వద్ద మాక్ పార్లమెంటును కూడా రైతులు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత సుదీర్ఘకాలం, ఇంత తీవ్ర స్థాయిలో ఒక ఆందోళన కొనసాగడం ఇదే మొదటిసారి. రాజకీయ ప్రత్యర్థులతో పాటు, ప్రజా ఉద్యమ నేతలు, సిబిఐ అధికారులు, చివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ల మీద కూడా ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో మోడీ సర్కారు పెట్టిన నిఘా నేరుగా రాజ్యాంగంపై దాడి చేయడంతో పాటు, ఒక రకంగా దేశ భద్రతకూ ప్రమాదకరమైనదే! ఇవి కాక, కరోనా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఆకాశానికి ఎగబాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు వంటి అంశాలూ ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నెలల తరబడి కొనసాగుతున్న ఆందోళనను పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశ రాజధానిలో కార్మికులు ప్రతిధ్వనింపచేశారు. ఆగస్టు తొమ్మిదవ తేది క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా నిర్వహించిన 'సేవ్ ఇండియా' ఆందోళనలు ధృడమౌతున్న కార్మిక, కర్షక మైత్రిని ఆవిష్కరింపచేశాయి. వివిధ రంగాలకు చెందిన ప్రజల సమస్యలు దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సహజంగానే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో వీటిపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటిపై చర్చను స్వాగతించి ఉండేది. దేశ ప్రజలకు వివరణ ఇచ్చి ఉండేది. కానీ, జరిగింది వేరు. ఏ దశలోనూ చర్చకు సిద్ధపడకపోగా ఏ అంశం ముందుకొచ్చినా 'ఆ ఒక్కటి తప్ప...' అనే ధోరణిని ప్రదర్శించింది. పైగా చట్టసభల్లో అలవోకగా అసత్యాలు చెప్పి దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండవ విడత కరోనాలో ఆక్సిజన్ కొరతతో దేశంలో ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పడం తిమ్మిని బమ్మి చేసే మోడీ ప్రభుత్వ ధోరణికి పరాకాష్ట. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు ప్రతిపక్షాలను చీల్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ఐక్య కార్యాచరణ పెరుగుతుండటంతో పార్లమెంటు సమావేశాలను అనూహ్యంగా వాయిదా వేసి పలాయనమంత్రం పఠించింది. చట్టసభలను మందబలంతో నడపవచ్చేమో కానీ, ప్రజా క్షేత్రంలో గుణపాఠం నేర్చుకోక తప్పదు!










