Dec 16,2022 21:58

పుస్తకావిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : సీనియర్‌ పాత్రికేయులు ఉన్నం వెంకటేశ్వర్లు రచించిన ఎదురీత పుస్తకాన్ని శుక్రవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి బంగ్లాలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగవైకల్యాన్ని అధిగమించి సమాజ మార్పు కోసం పనిచేసిన ఉన్నం వెంకటేశ్వర్లు రాసిన ఎదురీత పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదర్శ నేతలు, సింధూరం, అమరవీరులు పోరాట యోధులు అనే పుస్తకాలతో పాటు ఆయన అనేక కథలు రాశారన్నారు. ఆయన రచనల్లో నిశీతమైన పరిశీలన, విమర్శనాత్మక దృష్టి, సూక్ష్మ వివరాల అధ్యయనం వంటి మంచి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఆయన అనుభవాలు నేటితరం యువతీ యువకులకు తోడ్పడుతాయని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి, తెలుగు లెక్చరర్‌ శ్రీనివాసులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు జగన్మోహన్‌, యశ్వంత్‌, ముస్తాక్‌, జిఎల్‌ నరసింహులు, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.