Feb 25,2022 08:34
  • 8 ఏళ్లవుతున్నా కేడర్‌పై రివ్యూ చేయని అధికారులు
  • విభజనానంతరం మూడేళ్లకే సాధించుకున్న తెలంగాణ
  • కొరతతో ఆంధ్రాకు పాలనా బాధలు
  • కొత్త జిల్లాలు వస్తే మరిన్ని సమస్యలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రాన్ని అఖిలభారత సర్వీసు అధికారుల కొరత వేధిస్తున్నప్పటికీ... ఆ సమస్య పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు సాంకేతికంగా తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి సారించడం లేదు. అటు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన కొద్ది కాలానికే కేడర్‌ రివ్యూ చేసి అదనపు అధికారులను సాధించగా, ఇక్కడ ఆ ప్రయత్నాలే కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరమైన ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 260 మంది వరకు ఐఎఎస్‌ పోస్టులు ఉండగా, అందులో 196 మంది మాత్రమే పనిచేసున్నారు. వారిలో సచివాలయంలోని శాఖలకే దాదాపు 60 మంది వరకు ఐఎఎస్‌లు పనిచేస్తుండగా, శాఖాధిపతుల కార్యాలయాల్లో కమిషనర్లు, డైరెక్టర్లుగా మరికొంతమంది వ్యవహరిస్తున్నారు. కొంతమంది అయితే ఒక శాఖకు అధికారిగా ఉంటూ మరో మూడు, నాలుగు శాఖలకు అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ఉన్న శాఖలకే ఐఎఎస్‌ల కొరత ఉండగా, కొత్త జిల్లాలకు 13 మంది కలెక్టర్లు, 13 మంది జాయింట్‌ కలెక్టర్లతోపాటు కొత్తగా ఏర్పాటుచేసిన రెండో జాయింట్‌ కలెక్టర్లుగా మరికొంత మంది అవసరమవుతారు. అందుకే ఉన్న 260 పోస్టుల కన్నా అదనంగా ఐఎఎస్‌లు కావాల్సి ఉంటుంది. అదనపు ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు కావాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేడర్‌ స్ట్రెరత్‌ రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కేడర్‌లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది కావాలన్నది నిర్ధారించుకున్న తరువాత ఆ వివరాలను కేంద్ర డిఒపిటి శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ వివరాలను డిఒపిటి పరిశీలించిన తరువాత రాష్ట్ర అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించి, అవసరం ఎంతమంది అన్నది ఖరారు చేసి, అప్పుడు అదనపు కేటాయింపులు చేస్తుంది. వాస్తవంగా ఇది చిన్న కసరత్తుగానే చెప్పాలి. తెలంగాణ కూడా 2016-17లో ఈ రివ్యూ చేయడం, కేంద్రంతో చర్చించి, అదనపు ఐఎఎస్‌లను సాధించుకోవడం అన్నది ఒక నెల రోజుల్లోనే జరిగిపోయినట్లు రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఆదిత్యనాథ్‌ దాస్‌ సిఎస్‌గా ఉన్న సమయంలో ఒకసారి ఈ రివ్యూపై దృష్టి సారించినప్పటికీ, తరువాత ఆ ప్రక్రియ మూలపడిపోయినట్లు తెలిసింది.