Feb 05,2022 08:08
  • పాతవే ఇవ్వాలన్న ఉద్యోగులు
  • సిఎఫ్‌ఎంఎస్‌లో కొత్త పే స్లిప్‌ల అప్‌లోడ్‌


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పంతం కోసం ఉద్యోగులందరికీ ఒకట్రెండు తేదీల్లోనే కొత్త జీతాలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఉద్యోగులకు మాత్రం ఏ జీతాలనూ జమ చేయలేదు. రెగ్యులర్‌, టైమ్‌స్కేల్‌ ఎంప్లాయీస్‌తోపాటు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఖాతాల్లో శుక్రవారం వరకు జీతాలు జమవ్వలేదు. వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ పి శ్యామప్రసాద్‌, రిజిస్ట్రార్‌ కె శంకర్‌ యుజిసి స్కేల్‌లో ఉండటంతో వారికి మాత్రం జీతాలు జమయ్యాయి. కొత్త పిఆర్‌సి, పే స్కేల్స్‌ జిఓలను రద్దు చేయాలని పిఆర్‌సి పోరాట కమిటీ సమ్మెలోకి వెళ్లనుండటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్‌, ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో కొత్త జీతాలను జమ చేస్తోంది. ఆ ప్రకారం హెల్త్‌ వర్సిటీ ఉద్యోగులకు రెండో తేదీకే రూ.1.50 కోట్ల జీతాలు అందాల్సి ఉంది. మరోవైపు తమకు పాత జీతాలనే చెల్లించాలంటూ హెల్త్‌ వర్సిటీ ఉద్యోగ సంఘాల జెఎసి అధికారులకు లేఖలను అందజేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త జీతాలనే చెల్లిస్తామని వర్సిటీ ఫైనాన్స్‌ విభాగం అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు హెల్త్‌ వర్సిటీ ఉద్యోగులు కూడా ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జీతాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హెల్త్‌ యూనివర్సిటీలో 100 మంది రెగ్యులర్‌, టైమ్‌స్కేల్‌ ఉద్యోగులు, మరో 90 మంది కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో రెగ్యులర్‌, టైమ్‌స్కేల్‌ ఎంప్లాయీస్‌ జీతాల బిల్లులను ఫైనాన్స్‌ విభాగం అధికారులు రెండు రోజుల క్రితం సిఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినా, జీతాలు జమకాలేదు. ఆప్కాస్‌లో రిజిస్టర్డ్‌ అయిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించాలనే ఆదేశాలుండగా, హెల్త్‌ వర్సిటీలో అలాంటి ఉద్యోగులు లేకున్నా, వేతనాలు చెల్లించకపోవడం గమనార్హం. సచివాలయ ఉద్యోగులు శుక్రవారం నుంచే పెన్‌డౌన్‌ చేయడంతో హెల్త్‌ వర్సిటీ ఉద్యోగుల జీతాలు వస్తాయో, రావో తెలియని పరిస్థితి నెలకొంది.
 

                                                     డిపాజిట్లపై వడ్డీ కూడా జమకాలేదు

ప్రభుత్వ ఆదేశాలతో గతేడాది డిసెంబరలో ఎపి స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు (ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్‌) బదలాయించిన రూ.400 కోట్ల డిపాజిట్లకు ఈ నెల ఇంకా వడ్డీ జమకాలేదు. డిసెంబరు నెలకు సంబంధించి జనవరి రూ.1.92 కోట్ల వడ్డీని హెల్త్‌ వర్సిటీ బ్యాంకు ఖాతాలో కార్పొరేషన్‌ జమ చేయగా, జనవరి మాసానికి సంబంధించిన వడ్డీని మాత్రం ఇంకా జమచేయలేదు. వర్సిటీ కార్యకలాపాల కోసం రూ.400 కోట్ల నుంచి రూ.175 కోట్లను ఇవ్వాలని వర్సిటీ అధికారులు లేఖ రాసినా ప్రభుత్వం గానీ, కార్పొరేషన్‌ గానీ పట్టించుకున్న దాఖలాల్లేవు.