కొచ్చి : డాల్ఫిన్స్‌ని పరిరక్షించే చర్యల్లో భాగంగా మోడీ ప్రభుత్వం అక్టోబర్ 5ని జాతీయ డాల్ఫిన్ దినోత్సవంగా ప్రకటించింది. సముద్రాలు, నదుల్లో ఉండే డాల్ఫిన్స్‌ని కాపాడుకోవాలని, వాటిపై అవగాహన పెంచుకోవాలని మార్చి 25న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఘనంగా వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి జలచరాలపై ఉన్న మక్కువతోనో... పర్యావరణాన్ని సంరక్షించే యోచనలో భాగంగానో.. ఈ డాల్ఫిన్ దినోత్సవాన్ని ప్రకటించారనుకోవడం పొరపాటే. డాల్ఫిన్స్‌ని కాపాడేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పైకి కనిపించినా... వాటి మనుగడకే ముప్పు వాటిల్లే విధంగా అంతర్గత జలమార్గ ప్రాజెక్టులను ముందుకు తెస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల వల్ల డాల్ఫిన్లు ఏవిధంగా నష్టపోతున్నాయో తెలుసుకుంటే... ఆందోళన కలగకమానదు.
30 రకాల జలచరాల జాతులకు మన దేశంలోని సముద్రాలు, నదులు ఆవాసాలుగా ఉన్నాయి. ఇండస్ నది, సుట్లేస్, రావి, బియాస్ నదులతోపాటు, బ్రహ్మపుత్రా నదుల్లోనూ సింధు నది డాల్ఫిన్స్ (ప్లాటానిస్టిడే జాతికి చెందిన డాల్ఫిన్) ఉన్నాయి. ఇవే కాక హిందూ మహాసముద్రంలోని హంప్‌బ్యాక్ డాల్ఫిన్, ఇరావడ్డీ డాల్ఫిన్, ఈస్ట్యూరైన్ రకాలైన డాల్ఫిన్‌లు ఒడిశాలోని చిలికా సరస్సులో ఉన్నాయి. అయితే ఈ జాతికి చెందిన డాల్ఫిన్‌లు అంత ప్రసిద్ధి చెందినవి కాదు. ఇక యాంగ్జీ నదిలోని అరుదైన జాతికి చెందిన డాల్ఫిన్‌లు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాలుగా ఈ డాల్ఫిన్ జాతి తగ్గడంతో చేపల సంఖ్య కూడా తగ్గింది. దీంతో అధిక రేటు పలికే చేపల సంఖ్య తగ్గిపోయి.. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు 2012లోనే కనుగొన్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం గంగానదిని పునరుద్ధరించే దిశగా.. 'నమామి గంగే' అనే పథకాన్ని 2018లో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గంగానదిలో జలవిద్యుత్ ప్రాజెక్టులు, బ్యారేజీల కారణంగా ఆ నదిలోని డాల్ఫిన్స్ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం గంగానదిని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ పథకాల వల్ల నీటి ప్రవాహం గతంలో కంటే 10 శాతమే ఉందని.. మిగతా నీటిని కాలువలకు మళ్లించడం జరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో.. బంగ్లాదేశ్ సరిహద్దు నుండి సుమారు 18 కిలోమీటర్లు పొడవున గంగానదికి అడ్డంగా ఉన్న ఫరక్కా బ్యారేజ్ వల్ల కూడా చేపల సంఖ్య తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. గంగానదిలో డాల్ఫిన్‌ల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నాయి. 2015లో 207 డాల్ఫిన్స్ ఉంటే.. అవి కాస్తా.. 2017లో 154కి చేరాయని బీహార్‌లోని విక్రమశిల విశ్వవిద్యాలయం తెలిపింది.
2014లో మొదటిసారిగా ప్రధాని పదవి చేపట్టిన మోడీ.. 'జాతీయ జలమార్గం -1 ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు గంగానదిపై ఉత్తరద్రేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుండి, పశ్చిమబెంగాల్‌లోని హల్దియా వరకు దాదాపు 16,000 కిలోమీటర్ల మేర ఉంది. దీన్ని వాణిజ్య రవాణా కోసం ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామికంగా ఉపయోగపడే బొగ్గుతోపాటు, ప్రమాదకర వస్తువులు సరఫరా కానున్నాయి. అయితే గంగానదిలో ఇలా ప్రాజెక్టుల వల్ల డాల్ఫిన్‌లకు ప్రమాదం పొంచి ఉందని నచికేత్ కేల్కర్‌తో సహా మరికొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు 2019లోనే చెప్పారు.
జలమార్గాన్ని అభివృద్ధి చేయడంలో డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. డ్రెడ్జింగ్ అనేది.. నది అడుగున ఉన్న జలచరాలకు, ముఖ్యంగా డాల్ఫిన్లను, వాటి ఆవాసాలను నాశనం చేస్తుంది. డ్రెడ్జింగ్ వల్ల డాల్ఫిన్ జాతి నష్టపోతుందని కేల్కర్‌తోపాటు, అతని సహచరులు బీహార్‌లోని గంగానది డ్రెడ్జ్ చేసే సమయంలో గమనించారు. ఇక ఒక్క గంగానదే కాదు.. బ్రహ్మపుత్ర నది కూడా అదే పరిస్థితిలో ఉందని వారు అభిప్రాయపడ్డారు. బ్రహ్మపుత్ర ఉపనది అయిన బరాక్ నదిలో కూడా డాల్ఫిన్ జాతి నశించిపోతుందని 2019లో అధ్యయనం కనుగొంది. కేవలం నది డ్రెడ్జింగ్ మాత్రమే కాదు.. స్లూయిస్ గేట్ల నిర్మాణం, కట్టలు, డ్రెడ్జింగ్, నీటి పారుదల, గృహ అవసరాల కోసం నీటిని వెలికితీయడం వంటివి జల కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది.

జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా.. వాణిజ్య వ్యాపారాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికితగ్గట్టుగానే గత నెల్లో పాట్నా నుండి పాండు పోర్ట్ వరకు జల రవాణతో బంగ్లాదేశ్‌కు సుమారు 200 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని సరఫరా చేసినట్లు వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇకపోతే గంగానదిలోని డాల్ఫిన్‌ని భారతదేశ జాతీయ జల జంతువుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే జాతీయ జల జంతువుగా గుర్తించిన డాల్ఫిన్స్‌కి వాటి మనుగడ సాధించడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. సముద్ర మైనింగ్, వలల్లో చిక్కుకోవడం వంటి సవాళ్లున్నాయని సముద్ర పర్యావరణ శాస్త్రవేత్త దిపానీ సుతారియా అన్నారు. ఇక హంప్‌బ్యాక్ వంటి డాల్ఫిన్స్‌ని పట్టుకోవడానికి గిల్‌నెట్స్‌ను ఉపయోగిస్తారు. ఈ గిల్‌నెట్స్ వల్ల ప్రతి సంవత్సరం 80,000 వేల మంది చనిపోతున్నారని సుతారియా, ఆమె సహచరులు 2020లో కనుగొన్నారు.
ఏదిఏమైనా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు డాల్ఫిన్‌పై అవగాహన కలిగించడం, వాటికి ప్రాధాన్యతనివ్వడమే ఉత్తతమైన మార్గమని కేల్కర్ అభిప్రాయడుతున్నారు. డ్యామ్‌లు, వాటర్‌వే ప్రాజెక్టులు కాకుండా, నదీ డాల్ఫిన్‌లు ప్లాస్టిక్ కాలుష్యం, బైకాచ్‌గా చిక్కుకోవడం వంటి అనేక స్థానిక సమస్యలతో పోరాడవలసి ఉంటుంది. వివిధ స్థాయిల్లో సమస్యల్ని పరిష్కరించడం అవసరమని ఆయన అన్నారు.
ఇన్ని సమస్యలు డాల్ఫిన్‌లకు ఉచ్చుల్లా వుంటే... ఈ సమస్యలను పట్టించుకోకుండా, కేవలం 'డాల్ఫిన్ డే'ని ఘనంగా ప్రభుత్వం ప్రకటించడం అంటే బూటకంకాక మరేమిటని పర్యావరణ వేత్తలు పెదవి విరుస్తున్నారు.










