Dec 01,2022 21:15

విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

            ధర్మవరం టౌన్‌ : మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో భూకబాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం మితిమీరిపోయాయని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ధర్మవరాన్ని రావణకాష్టం చేయవద్దని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సూచించారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న నివాసాలకు సంబంధించి కోర్టు ఇచ్చి స్టే పత్రాలను బాధితులకు అందజేశారు. అనంతరం తన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాంట్‌ ఎదురుగా ఉన్న కాలనీలో దాదా 40ఏళ్లగా చాలామంది పేదలు నివాసం ఉంటున్నారన్నారు. అయితే కొందరు అధికారపార్టీ నాయకులు ఈ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని, ఇంటి విస్తీర్ణాన్ని బట్టి డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు తమ దృష్టికి తెచ్చారన్నారు. దీంతో వారి తరపున హైకోరుకు వెళ్లి స్టే తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇకపై ఆ స్థలంపై పోలీసులు, అధికార పార్టీ నాయకులు కలుగజేసుకోరాదని సూచించారు. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమంలో ఖాళీస్థలాలు, విలువైన స్థలాలను గుర్తించి వాటిని తక్కువ ధరకు దౌర్జన్యంగా తీసుకుని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి భూములను బాధితులకే తిరిగి ఇప్పిస్తామన్నారు. ఆర్డీవో, తహశీల్దార్లు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిసున్నారన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా దొంగ రిజిస్ట్రేషన్లు ఎక్కువ అయ్యాయన్నారు. అలాగే రేగాటిపల్లి, చిగిచెర్ల సొసైటీ భూములను కూడా కాజేయాలని చూస్తున్నారని, వాటిపై హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చామన్నారు. అధికార పార్టీ నాయకుల మాట వింటూపోతే అధికారులకు కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డిష్‌ రాజు, చిగిచెర్ల అరవిందరెడ్డి, టిడిపి శీన, గొట్లూరు చంద్ర, తుంపర్తి పరమేష్‌, చిలకం సూర్యనారాయణరెడ్డి, పోతుల నాగేపల్లి లక్ష్మీనారాయణ, వీరప్ప, ముదిగుబ్బ నాయకులు నారాయణస్వామి, దేవేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.