ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ధర్మవరానికి చెందిన యువతికి జనసేన పార్టీ చేయూతను అందించింది. పవన్‌కళ్యాణ్ గతంలో ధర్మవరంలో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు యువతికి చేయూతను అందిస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మదుసూదన్ రెడ్డి తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ధర్మవరంలో గతంలో పర్యటించిన సందర్భంగా గొట్లూరు గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారన్నారు. ఈ క్రమంలో నిట్టూరుబాబు పెద్దకుమార్తె హలీమాను పరామర్శించిన పవన్ ఆమె విద్యాభ్యాసంపై ఆరా తీశారన్నారు. తాను డిగ్రీ పూర్తి చేశానని భవిష్యత్తులో ఎస్‌ఐ కావాలనుకున్నానని యువతి పవన్‌కళ్యాణ్‌కు తెలిపారన్నారు. అందుకు స్పందించిన పవన్ ఎస్‌ఐ అవ్వడానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో హలీమాకు కోచింగు అయ్యే ఖర్చుతోపాటు హాస్టల్, ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే, ఫిజికల్ టెస్టుల తరువాత మెయిన్స్ పరీక్షలకు మొత్తం ఖర్చులన్నీ జనసేన పార్టీ తరపున పవన్ కల్యాణ్ భరిస్తున్నట్లు చిలకం తెలిపారు. దీంతో యువతి హలీమా పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి దాసరి రామాంజనేయులు, నాయకులు లింగాలప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










