May 21,2023 22:51

విలేకరులతో మాట్లాడుతున్న గోనుగుంట్ల సూర్యనారాయణ

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ధర్మవరం కేంద్రంగా 6 నెలలుగా, సత్యసాయి జిల్లా, పక్కజిల్లాలతోపాటు కర్నాటక రాష్ట్రానికి దొంగనోట్లు చెలామణి అవుతున్నాయని ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్మే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ధర్మవరంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2009-2014 మధ్యలో ధర్మవరంలో దొంగనోట్ల చెలామణి అధికంగా ఉండేదన్నారు. అప్పట్లో దొంగనోట్ల చెలామణి చేసిన వారు ఓ రాజకీయనాయకుడికి ఓ ఇంటిని కూడా నిర్మించి ఇచ్చారని అప్పట్లో చర్చకూడా జరిగిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో రూ.500 నోటు తీసుకోవాలంటే ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉండేదన్నారు. 2014 తరువాత తాము అధికారంలోకి వచ్చాక 2019 వరకు దొంగనోట్ల చెలామణిని పూర్తిగా అరికట్టి ధర్మవరాన్ని ప్రశాంతంగా ఉండేలా చేశామన్నారు 2020 తరువాత తిరిగి ధర్మవరం నియోజకవర్గకేంద్రంగా దొంగనోట్లు చెలామణి, ముద్రణ జరుగుతుందని ప్రజల్లో చర్చజరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అని దొంగనోట్లు కాదని హితవుపలికారు. ఈ దొంగనోట్ల ముద్రణ, చెలామణిపై చర్యలుతీసుకోవాలని కోరుతూ మోడీ, అమిత్‌షాకు లేఖ పంపుతున్నామన్నారు. ఇప్పటికైనా పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేయడం మానుకోవాలన్నారు. దొంగనోట్లు ధర్మవరంలో ఎక్కడ ముద్రిస్తున్నారు.ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. కానీ కొందరు పోలీసు అధికారులే వారికి సహకరించే పరిస్థితి ఉందని ఆరోపించారు. అదేవిధంగా దొంగనోట్ల చెలామణి, ముద్రణపై త్వరలో సత్యసాయి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు గోనుగుంట్ల సూర్యనారాయణ చెప్పారు.