ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్ : పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామ సచివాలయం వద్ద సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ మరియు మందుల ధరలు, పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కోట కృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతుందని, వంటగ్యాస్ 50 రూపాయలు ఒకేసారి పెంచిందని, మందుల ధరలు 12 శాతం పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వంటనూనెల ధరలు మండిపోతున్నాయని, చికెన్, మటన్ తో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు పెంచిన వస్తువులను కొనలేక ఇబ్బందులకు గురవుతున్నారని, కరోన కష్టకలంలో ప్రజలందరూ అప్పుల పాలయ్యారని, ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని, కొంత మందికి ఉపాధి పోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కానీ వారి ఆదాయాలు పెరగలేదని, సామాన్యులకు ప్రభుత్వం రేషన్ షాప్ లలో బియ్యం మాత్రమే ఇస్తూ పామాయిల్ నిలిపివేశారని, నిత్యావసర వస్తువులు ఇవ్వడం లేదని, పంచదార, కందిపప్పు అరకొరగానే అందజేస్తూ ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, వంటగ్యాస్ పై సబ్సిడీని పునరుద్ధరించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, రేషన్ డిపోల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు అందించాలని, పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని కోరారు. అనంతరం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కాకనబోయిన లింగారావు, దంతాల వెంకటేశ్వర్లు, షేక్ మేరా సాహెబ్, షేక్ బడే మియా, కాకనబోయిన సుబ్బారావు, షేక్ మాబు సుభాని తదితరులు పాల్గొన్నారు.










