న్యూఢిల్లీ : దేశంలో మోడీ సర్కార్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు భారీ రెస్పాన్స్ వస్తోంది. లేబర్ కోడ్లు, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్‌ఎంపి) రద్దు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు వేతనం పెంచాలని, కాంట్రాక్టు వర్కర్లను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 28, 29న ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం మొదలైన ఈ సమ్మెలో సుమారు 20 కోట్ల మంది కార్మికులు, కర్షకులు భాగస్వామ్యం అవుతున్నారు. ఈ సమ్మెకు బ్యాంకింగ్, విద్యుత్, రవాణా, ఇతర రంగాల్లోని కార్మికులు మద్దతిస్తున్న నేపథ్యంలో.. కార్యకలాపాలు స్థంభించిపోయాయి. అరెస్టులు, నిర్బంధాల చోటుచేసుకున్నప్పటికీ.. తొలి రోజు సమ్మె విజయవంతమైంది. ప్రజా, కార్మిక, కర్షక, జాతి వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్న మోడీ సర్కార్ వైఖరికి నిసనగా జాయింట్ ఫోరమ్.. ఈ నెల 22న ఢిల్లీలో సమావేశమై.. ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 20 కోట్లకు పైగా, 10కి పైగా కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని ఆల్ ఇండియా యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు.
ఏఏ సంఘాలు భాగస్వామ్యం అవుతున్నాయంటే...
ఎఐటియుసి, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టియుసి) హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్), సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు), ఆల్ ఇంఇయా యుననైటెడ్ ట్రేడ్ సెంటర్ (ఎఐయుటియుసి), ట్రేడ్ యూనియన్ కో ఆర్డినేషన్ సెంటర్ (టియుసిసి), సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (సేవా), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఎఐసిసిటియు), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్‌పిఎఫ్), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యుటియుసి) వంటి సంఘాలు పాల్గొంటున్నాయి. ఇవే కాకుండా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబియుఎ), రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) సంఘీభావాన్ని ప్రకటించాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం ఈ సమ్మెలో పాల్గొనడం లేదని తెలిపింది.
ఈ బంద్‌కు పలు రాష్ర్టాల నుండి భారీ మద్దతు లభిస్తుందని కౌర్ తెలిపారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని మొత్తం బొగ్గు గనుల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని, అదేవిధంగా అసోం, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బీహార్, పంజాబ్, రాజస్తాన్, గోవా, ఒడిశాల్లో పారిశ్రామిక ప్రాంతాల నుండి భారీ స్పందన వస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ సమ్మె నేపథ్యంలో విధులు యధావిధిగా కొనసాగించాలని విద్యుత్ శాఖ అన్ని ప్రభుత్వ, ఎలక్ట్రిసిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సమ్మెకు మద్దతునిచ్చిన కారణంగా కస్టమర్ సేవలకు అంతరాయం కలిగించద్దంటూ ఎస్‌బిఐతో సహా పలు బ్యాంకులకు హెచ్చరికలు అందాయని సమాచారం.

ఢిల్లీ
మోడీ వ్యతిరేక విధానాలను నిరసనగా ఢిల్లీ నుండి గల్లీ దాకా కార్మిక, కర్షక సంఘాలు ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నాయి. ఢిల్లీలో బ్యాంకులు మూతపడ్డాయి. తమ డిమాండ్లతో కూడిన హోర్డింగ్‌లను బ్యాంకుల ఎదుట ఉంచారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో బంద్‌లో పాల్గొంటున్నాయి.

కోల్‌కతా
బెంగాల్‌లో భారీ మద్దతు లభిస్తుంది. అక్కడ రైళ్లు, రహదారులను దిగ్బంధించి.. ఆందోళనలు చేపడుతున్నారు. వామపక్ష నేతలు, ఇతరులు ఈ సమ్మెలో పాల్గొని .. మోడీ వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. జాదవ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌లపై నిరసనలు వ్యక్తం చేశారు. కాగా, కుల్గాచియా స్టేషన్‌లో కదులుతున్న రైలును ఆపేందుకు ప్రయత్నించిన కొంత మంది వామపక్ష కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సమ్మెకు మమత మద్దతునివ్వలేదు.
కేరళ
కేరళలో సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు లభిస్తోంది. తొలి రోజు స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూత పడ్డాయి. దీంతో వీధులన్నీ బోసిపోయాయి. రవాణా కూడా స్థంభించిపోయింది. ప్రభుత్వ ఆర్టీసి కెఎస్‌ఆర్‌టిసి కూడా తన సేవలను నిలిపివేసింది. కాగా, ప్రైవేటు వాహనాలు కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో... పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఎమర్జెనీ సర్వీసులు, పాలు, న్యూస్‌పేపర్ వంటి సేవలను అంతరాయం ఏర్పరచలేదు. తిరువనంతపురం రైల్వే స్టేషన్, రీజనల్ కేన్సర్ సెంటర్‌కు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను పోలీసులు ఏర్పాటు చేశారు.
తమిళనాడు
ఇటు తమిళనాడులో సైతం బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఇక్కడ రహదారులపై కేవలం 20 శాతం బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఇక్కడ బంద్‌కు తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో, ఇతర రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వామపక్ష పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు బంద్‌ను నిర్వహిస్తున్నాయి. రహదారులు, రైల్వే ట్రాక్స్‌ను దిగ్బంధించాయి.










