Mar 16,2023 22:01

ఫొటో : నిరసన తెలియజేస్తున్న నాయకులు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
ప్రజాశక్తి-సంగం : మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంపై తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు, టిడిపి నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ ప్రవీణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ రైతు సంఘం నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మండలంలో వరి కోతలు ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్న అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని మండిపడ్డారు.
17వ తేదీ నుండి 20వ తేదీ వరకు వర్షాలు ఉన్న నేపథ్యంలో ధాన్యం కల్లాల్లోనే ఉండడం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అధికారులు రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకురాలు మంజుల, విజయకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, బాబు, వేణు, బాలు, తదితరులు పాల్గొన్నారు.