Mar 13,2022 07:36

* పుట్టికి వెయ్యి కేజీల డిమాండ్‌
* కన్నీరు పెడుతున్న రైతులు

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : 'ధాన్యానికి మద్దతు కల్పిస్తాం. రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికెలు) ద్వారా ప్రతి గింజా కొనుగోలు చేస్తాం' అని ప్రభుత్వం చేసిన ప్రకటన నెల్లూరు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. ఆర్‌బికెలు, ధాన్యాం కొనుగోలు కేంద్రాలు రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. దీంతో, ఖరీఫ్‌లో ఆరుగాలం కష్టపడి వరి పండించిన అన్నదాతలను మిల్లర్లు, దళారులు దోచుకుంటున్నారు. ధరలోనూ, తూకంలోనూ, తేమ అధికంగా ఉందనే పేరుతోనూ మోసానికి పాల్పడుతున్నారు. తీవ్రంగా నష్టపోతుండడంతో రైతులు కన్నీరు పెడుతున్నాడు. గ్రేడ్‌-ఎ రకమైన బిపిటి ధాన్యానికి పుట్టికి (850 కేజీలకు) ప్రభుత్వం రూ.16,600 ధర నిర్ణయించింది. మిల్లర్లు, దళారులు రూ.13,500 నుంచి రూ.14 వేల వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. నిబంధలను అత్రికమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్ప, చేసిందేమీలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రైతులు ఏటా సుమారు రూ.450 కోట్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా. వరి ఉత్పత్తిలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉంది. జిల్లాలో ఏడాదికి రెండు పంటలు చేతికొస్తాయి. ప్రస్తుత రబీలో 5.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి సుమారు 16 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. సోమశిల, కండలేరు ప్రధాన ప్రాజెక్టులతోపాటు బోర్లు, బావుల కింద సాగు చేస్తున్నారు. జిల్లాలో బిపిటి (5204) జిలకర మసూర, ఎన్‌ఎల్‌ఆర్‌ (34449) నెల్లూరు మసూర, ఆర్‌ఎన్‌ ఆర్‌ (15048 ) తెలంగాణ సోనా, షుగర్‌ ఫ్రీ, జెబిఎల్‌ (1798) జగిత్యాల మసూర, ఎన్‌ఎల్‌ఆర్‌ (3354 ) రకాలు సాగు చేస్తున్నారు. ఇందులో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం 2.25 లక్షల ఎకరాల్లో, ఎన్‌ఎల్‌ఆర్‌ (3444) రకం 1.5 లక్షల ఎకరాల్లో, బిపిటి జిలకర మసూర 1.37 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది సాగు ఖర్చులు భారీగా పెరిగాయి. కూలీలు, ఎరువులు, పురుగు మందులు కలిపి ఎకరానికి సుమారు రూ.25 వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. 'ఎ' గ్రేడ్‌ రకం ధాన్యానికి రూ.16,660, సాధారణ రకం ధాన్యానికి రూ.16,490 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. రైతులు ముందుకు ఆర్‌బికెలు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తమ సొంత ఖర్చులతో ధాన్యాన్ని ముందుగా తీసుకొస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉందని, ధాన్యానికి మచ్చ ఉందని, ధాన్యం పచ్చిగా ఉందని చెప్తూ పుట్టికి 850 కేజీలు తీసుకోవాల్సి ఉండగా, కొన్నిచోట్ల వెయ్యి కేజీలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మిల్లర్లను, దళారులను రైతులు ఆశ్రయించాల్సి వస్తోంది. పుట్టి ధాన్యాన్ని రూ.14,000 నుంచి రూ.13,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పుట్టి ఒక్కంటికీ సుమారు రూ.2,300 వరకు రైతులు నష్టపోతున్నారు.
అక్రమాలకు పాల్పడితే కేసులు - హరేంద్ర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు 473 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 90 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 60 వేల టన్నులు కొనుగోలు చేశాం. ఇందులో ఈ సీజన్‌లో పది వేల టన్నులు తీసుకున్నాం. ఎక్కడా పుట్టికి వెయ్యి కేజీలు ఇవ్వమని చెప్పడం లేదు. రైతులే కొందరు 960 కేజీలు ఇస్తామని చెప్పినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రమాణాల ప్రకారం ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మా లక్ష్యం ప్రకారం కొనుగోలు చేస్తున్నాం.
రైతులు నష్టపోతున్నారు..  ఎం.వెంగయ్య, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
ప్రభుత్వం చెబుతున్నదానికి ఇక్కడ జరుగుతున్నదానికి తేడా ఉంది. కొన్ని కేంద్రాల్లో పుట్టికి వెయ్యి కేజీలు తీసుకుంటున్నారు. గోదాములు లేక కేంద్రాల వద్దకు తీసుకొచ్చి తెగనమ్ముకుంటున్నారు. మద్దతు ధర కంటే తక్కువకే మిల్లర్లు, దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ-క్రాఫ్‌లో నమోదు కావాలంటున్నారు. తేమ పేరుతో 150 కేజీలు అధనంగా రైతుల నుంచి తీసుకుంటున్నారు. తేమ 17 శాతం కన్నా తక్కువ ఉండాలనే పేరుతో అదనంగా ధాన్యం తీసుకుంటున్నారు. బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లుకు కేటాయిస్తున్నారు. ఇక్కడే రైతుల నుంచి దోచుకుంటున్నారు.