ప్రజాశక్తి-కలెక్టరేట్: జిల్లాలో రైతులకు, కౌలు రైతులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదు నెలల నుండి రైతులకు ధాన్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయని కాబట్టి పెండింగ్లో ఉన్న 130 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి రంగారావు మాట్లాడుతూ జిల్లాలో 22 ఎ నిషేధిత భూములు 55,170 ఎకరాలు ఇచ్చారని దీనివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాబట్టి నిషేధిత జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వీటిలో కోడూరు, నాగాయలంక మండలాల్లోనే ఇన్ని వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయంటే రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అధికారులు మననం చేసుకోవాలన్నారు. అలాగే గత ఏడాది పసుపు, తదితర వాణిజ్య పంటల బీమాలో అనేక అవకతవకలు జరిగాయని కాబట్టి ఆ జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఆర్ ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి బివి శ్రీనివాసరావు, పులి వెంకటేశ్వరరావు, కె.శివనారాయణ తదితరులు పాల్గొన్నారు.










