డిపో మేనేజర్‌కు సిపిఎం వినతి
రాయచోటి టౌన్ : ఆర్‌టిసి బస్టాండ్‌లో టెండరు ద్వారా గదులు దక్కించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్‌టిసి బస్టాండ్‌లో దుకాణదారులు బయట ప్రాంతాల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని, ఎంఆర్‌పికే ధరలకే విక్రయించాలని అడిగితే ప్రయాణికులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. తాగునీరు లీటరు ఎంఆర్‌పి ధర రూ.20 ఉండగా రూ. 25 నుండి రూ.30 లకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఐఎస్‌ఐ మార్కు గల కంపెనీల నీటి సీసాలను కాకుండా స్థానికంగా లభించే నీటి సీసాలనే ఎక్కువగా విక్రయిస్తున్నారని విమర్శించారు. ప్రయాణికులకు అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానం వ్యక్తం చేశారు. డిపో మేనేజర్ జోక్యం చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, నాయకులు నరసింహ, జాన్ ప్రసాద్, కార్తీక్, రమణ పాల్గొన్నారు.










