Oct 07,2022 22:42

  •  ఇక నుండి అంతరాలయ దర్శనం రూ.500
  •  దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం భవానీ క్యూ లైన్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ మంత్రి కొట్టు సత్యనారాయణకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకూ రూ.300 టిక్కెట్‌పై అంతరాలయ దర్శనం ఉండేదని, ఇక నుండి రూ.500 టిక్కెట్‌ కొన్నవారికే అంతరాలయ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. వారికి రెండు లడ్డూలు ఉచితంగా ఇస్తామన్నారు. అంతరాలయ దర్శనం రూ.500కు పెంచడం భారంగా మారుతుందని విలేకరుల అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ దేవాలయ అభివృద్ధి కోసమే ఈ రకమైన చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. అలాగే ఉత్సవాలకు ఎంత బడ్జెట్‌ కేటాయించారని అడగ్గా లెక్కలు చూడాలని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా యాత్రికులు సమర్పించిన కానుకల విషయమై మంత్రిని ప్రశ్నించగా హుండీలను లెక్కించాల్సి వుందని, రెండు రోజుల్లో వివరాలు తెలియజేస్తామన్నారు. రానున్న రోజుల్లో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో దుర్గగుడి ఇఓ భ్రమరాంబ పాల్గొన్నారు.