Oct 17,2022 23:26

  • 26 నుండి కార్తీక మాసం ప్రత్యేక పూజలు
  • నవంబర్‌ 4 నుండి 8 వరకు భవానీల మాలాధారణ
  • డిసెంబర్‌ 15 నుండి 19 వరకూ గిరిప్రదక్షిణలు, మాల విరమణ
  • దుర్గగుడి ఇఒ భ్రమరాంబ వెల్లడి

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : విజయవాడ కనక దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు అనంతరం సోమవారం దుర్గగుడి మహామండపం ఆరో అంతస్తులో ఆమె మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో హుండీలు, లడ్డూ ప్రసాదాలు, కేశఖండనశాల, పూజా సేవల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే ఉత్సవాల నిర్వహణకు రూ.10.5 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈనెల 23న ధనత్రయోదశి సందర్భంగా యాగశాలలో మహాలక్ష్మీ యాగం, రుద్రహాోమం జరుగుతాయని తెలిపారు. 24న దీపావళి పండుగ సందర్భంగా ధనలక్ష్మీ పూజ అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 25న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. 26వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆకాశదీపం ప్రారంభమవుతుందని, 27న శ్రీ అమ్మవారికి గాజుల అలంకారం, 29న నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకాలు జరుగుతాయన్నారు. నవంబర్‌ 4 నుండి 8వ తేదీ వరకూ శ్రీ భవానీ దీక్షా మాలాధారణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 7న కోటి దిపోత్సవం, 8న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 8 గంటలకు ఆలయాన్ని మూసివేసి 9న యధావిధిగా దర్శనం కల్పిస్తామన్నారు. డిసెంబర్‌ 15 నుండి 19వ తేదీ వరకూ భవానీ దీక్షల విరమణలు, గిరిప్రదక్షిణలు ప్రారంభమవుతాయని, ఆ రోజుల్లో సుమారు రోజుకు లక్షన్నర మంది భవానీలు దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తారని ఇఓ భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్‌ 19న పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగుస్తాయన్నారు. భవానీల కోసం రెండు హాోమగుండాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యులు ఆర్‌ శ్రీనివాస శాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.వి.ఎస్‌. కోటేశ్వరరావు, లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వాహణాధికారి పి.సుధారాణి పాల్గొన్నారు.