May 01,2022 09:21

తెలుగు తెరకి మార్షల్‌ ఆర్ట్స్‌ని పరిచయం చేసిన హీరోగా భానుచందర్‌కి గొప్ప పేరు ఉంది. ఇండిస్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే 100కు పైగా సినిమాల్లో నటించి రికార్డ్‌ సృష్టించారు భానుచందర్‌. నటుడిగా, దర్శకుడిగా సంగీత దర్శకుడిగా భానుచందర్‌ సినిమాకి సంబంధించిన వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ ఉంది. 80, 90ల్లో స్టార్‌ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందించారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌ను పలకరిస్తున్న ఇటీవల 'సేవదాస్‌', 'ఓ మై డాగ్‌' వంటి చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ ఛానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు..
హీరో భానుచందర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. డూప్‌ లేకుండా సొంతంగా ఫైట్‌ చేసే అతి కొద్దిమంది తెలుగు హీరోల్లో భానుచందర్‌ పేరు ప్రముఖంగా వినిపించేది. కెరీర్‌ తొలినాళ్లలో హీరోగా అనేక సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారిని అభిమానులుగా మార్చుకున్నారు. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన భానుచందర్‌ తెలుగులో మన ఊరి పాండవులు చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, నిరీక్షణ వంటి హిట్‌ చిత్రాలను చేసి నటుడిగా నిలదొక్కుకున్నారు.
ఆయన చేసిన నిరీక్షణ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును అందుకున్నారు. టాలీవుడ్‌లో ఎంతో మంది పెద్ద పెద్ద దర్శకులతో నిర్మాతలతో పనిచేసిన ఆయన సింధూరం, దేవి, సింహాద్రి, స్టైల్‌ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి తాను అన్నిరకాల సినిమాలు చేయగల నటుడు అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం హీరోగా చాలా తక్కువ సినిమాలు చేస్తూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన హిట్‌ సినిమాలోనూ కీలకపాత్రలో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ భాషలో సైతం ఆయనకు మంచి గుర్తింపు ఉంది. టీవీ సీరియల్స్‌లో సైతం నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు భానుచందర్‌.

  • మ్యుజీషియన్‌ నుంచి నటుడిగా..

'చంటిబాబు మా నాన్న దగ్గర పనిచేసేవారు. ఆయన కుమార్తె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. రజనీకాంత్‌ క్లాస్‌మేట్‌ ఆమె. అదే సమయంలో నేను ముంబైకి వెళ్లాను. అక్కడ విపరీతంగా డ్రగ్స్‌ తీసుకోవడం, చెడు అలవాట్లకు బానిస కావడంతో ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఇంట్లో ఎంత చెప్పినా వినలేదు. చివరికి అమ్మ ఒత్తిడితో చెన్నరు వచ్చాను. ఈ డ్రగ్స్‌ నుంచి బయటపడేందుకు మా అన్నయ్య నన్ను మార్షల్‌ ఆర్ట్స్‌లో చేర్పించాడు. తైక్వాండోతో చెడు అలవాట్లు అన్నీ పోయాయి. అలా మార్షన్‌ ఆర్ట్స్‌లో బ్లాక్‌బెల్డ్‌ సాధించా. ఆ తర్వాత నా కెరీర్‌ మారిపోయింది' అని చెప్పుకొచ్చారు.
'తర్వాత సుమన్‌ను కలుసుకోవడం, సినిమాల్లో నటించడం మొదలయ్యింది. ఒకరోజు తమ్మారెడ్డి భరద్వాజ దగ్గరకు వెళ్లి సుమన్‌, నేనూ కలిసి తమిళంలో సినిమా చేస్తున్నాం. సుమన్‌ ముఖం చూస్తే తెలుగు వారికి బాగా నచ్చుతాడు..ఇద్దరిని కలిపి మార్షల్‌ ఆర్ట్స్‌తో సినిమా తీయాలని చెప్పా. మూడురోజుల్లో 'ఇద్దరు కిలాడీలు' సినిమా మొదలయ్యింది. దానికంటే ముందు 'తరంగిణి' విడుదలయ్యింది. నిర్మాతలందరూ మా ఇద్దరిమీద పడ్డారు. అన్ని కొట్టుకునే సినిమాలు వచ్చాయి' అన్నారు.

  • చనిపోయే లోపు ఆ ఒక్కటీ తీస్తా..

'నా విషయంలో భార్య స్వర్ణలక్ష్మి కుమారి, పిల్లలే విమర్శకులు. ఆమె, పిల్లలు కొన్ని సినిమాల విషయంలో తిడతారు. బాగా గుర్తు పెట్టుకునే సినిమాలు తీయొచ్చు కదా అంటారు. కశ్మీర్‌ఫైల్స్‌ చాలా అద్భుతమైన సినిమా. అది ఆస్కార్‌కు వెళ్తుంది. అటువంటి సినిమా ఒక్కటి తీసి చనిపోయినా చాలు. అలాంటి సినిమాలో నటించినా, డైరెక్టు చేసినా చాలు అనే భావన కలుగుతోంది. జై భీమ్‌ చాలా మంచి సినిమా. సూర్య ఆ క్యారెక్టర్‌ చేయడం గొప్ప విషయం. అలాంటి సినిమాలు చేయాలని ఉంది. నటుడు ఎప్పుడూ సంతృప్తి చెందడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక నటుడే. అయితే అన్ని రకాల పాత్రలూ చేయాలంటే నటుడికి జీవితకాలం సరిపోతుందా..? సినిమాలు నిర్మించడమే కాదు.. దర్శకత్వం కూడా చేస్తాను. నేను సినిమాలను ప్రేమిస్తా. వంద చేయకపోయినా ఒక్క సినిమా అయినా బాగా చేశాడని మెచ్చుకోవాలి' అని చెప్పుకొచ్చారు.

పేరు : భానుచందర్‌
అసలు పేరు : మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్‌
పుట్టిన తేదీ : జులై 2, 1952
చదువు : గ్రాడ్యుయేషన్‌
నివాసం : చెన్నరు
భార్య : స్వర్ణలక్ష్మి కుమారి
పిల్లలు : జయంత్‌, నిశాంత్‌
తల్లిదండ్రులు : మాస్టర్‌ వేణు, శకుంతల