ప్రజాశక్తి - వన్‌టౌన్ : స్థానిక 43వ డివిజన్‌లోని 134వ సచివాలయం పరిధిలో 11వ రోజు సోమవారం గడపగడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, ఎమ్మెల్సీ రుహుల్లా, స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఊర్మిళా సుబ్బారావునగర్‌లోని మంగమ్మ కొట్టు రోడ్, కష్ణారెడ్డి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. గడపగడపకు వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాంతంలో డ్రెయిన్లలో నీరు సక్రమంగా పారుదల కావడంలేదని, మురుగు వాసన, దోమలతో అల్లాడిపోతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. మరికొందరు తమ ఇళ్ల పట్టాలను రెగ్యులరైజ్ చేయించాలని కోరారు. భర్త చనిపోయాడని, పింఛనుకు దరఖాస్తు చేసుకున్నా ఇరతవరకు రాలేదని ఇరువూరు కోటేశ్వరమ్మ అనే వృద్ధురాలు వాపోయింది. ఎమ్మెల్యే వెలంపల్లి స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైన్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షులు కంది శ్రీనివాసరెడ్డి, పైలా సోమినాయుడు, కార్పొరేటర్లు పడిగపాటి చైతన్య రెడ్డి, మరుపిళ్ల రాజేష్, ఎండి.ఇర్ఫాన్, యరడ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.










