Jan 31,2023 21:21

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం నాయకులు పి.పెంచలయ్య

'దోపిడీ పోవాలి-అభివృద్ధి కావాలి'
ప్రజాశక్తి-కావలి : ''ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక'' ఆధ్వర్యంలో కావలి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ''దోపిడీ పోవాలి-అభివృద్ధి కావాలి'' సేవ్‌-కావలి అని నాయకులు నినదించారు. అందుకు సంబంధించిన కరపత్రంను ఆవిష్కరించారు. అనంతరం కావలి పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు పి.పెంచలయ్య (సిపిఎం) మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో దోపిడీ సఫలం, అభివృద్ధి విఫలమైందన్నారు. గత నాలుగు సంవత్సరాలలో కావలి నియోజక అభివృద్ధి ఆవగింజంతైనా లేదని, దోపిడీ మాత్రం హిమాలయాల అంత ఎత్తు ఉందన్నారు.
గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తయిన అమృత పథకం, రోడ్లు, కాలువలు, మురుగునీటి శుద్ధి కేంద్రం వంటి పనులు కూడా పూర్తి చేయలేని కావలి ఎంఎల్‌ఎ అసమర్థ పాలన చేస్తున్నారన్నారు. కావలి మున్సిపాలిటీని అవినీతికి కేంద్రంగా అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీని అడ్డం పెట్టుకొని, ఉద్దేశపూర్వకంగా కౌన్సిల్‌ లేకుండా కేవలం తన పెత్తనం మాత్రమే ఉండేలా ఎంఎల్‌ఎ చేశారన్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుని అవినీతికి గేట్లు బార్ల తీసి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారని విమర్శించారు. మున్సిపాలిటీలో పనులు చేయించుకోలేక ముడుపులు ముట్ట చెప్పలేక కావలి పట్టణ ప్రజల జీవితాలు చిద్రం అయ్యాయన్నారు. కనీసం పారిశుధ్య పనులు కూడా సరిగ్గా జరగడం లేదని, పందులు కుక్కల దాడులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమృత పథకం కింద మంజూరైన వాటర్‌, ట్యాంకులు పైపులైన్లు నిరుపయోగంగా మార్చారన్నారు. మున్సిపాలిటీ అధికారులు అవినీతికి పాల్పడుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలకు, పార్కింగ్‌ లేని షాపింగ్‌మాల్స్‌కు అనుమతులు ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వేదిక నాయకులు మాట్లాడుతూ తుమ్మలపెంట తాళ్లపాలెం బట్లదిన్నె రోడ్లకు మోక్షం లేదని అన్నారు. పెద్దపవని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పూర్తిగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నియోజకవర్గం అక్రమ గ్రావెల్‌, అక్రమ లేఅవుట్లకు కేంద్రంగా మారిందన్నారు. దోపిడీ ఉందనీ, అవినీతి జరుగుతుందని స్వయంగా ఎంఎలఎనే ఒప్పుకోవడం గమనార్హం అని దుయ్యబట్టారు. ఇసుక అక్రమ రవాణా, కల్తీ ఇసుక అమ్మకాలతో కోట్ల రూపాయలు గడించారన్నారు. నియోజకవర్గంలో రోడ్లు కాలువలు కానీ శివారు ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా కనీస సౌకర్యాలు అయినా రోడ్లు కాలవలో కరెంటు కూడా కావలి ఎంఎల్‌ఎ వేయించలేకపోయాడని తెలిపారు. సహజ వనరులైన కాలువలు చెరువులు కుంటలు మట్టిని దోపిడీ చేశారన్నారు. సహజ వనరుల దోపిడీ గురించి ఎఎంల్‌ఎను నిలదీయాలని కోరారు. దోపిడీ పోవాలి అభివృద్ధి కావాలి సహజ వనరుల దోపిడీ నుంచి కావలిని రక్షించుకుందాం అనే పేరుతో జరుగుతున్న ఉద్యమం ప్రజల ఉద్యమం అని అందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ చింతాల వెంకట్రావు, టిడిపి నాయకులు జ్యోతి బాబురావు, సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, సిపిఐ నాయకులు కే నరసింహం, న్యూ డెమోక్రసీ నాయకులు కరవది భాస్కర్‌, జనసేన నాయకులు పొబ్బ సాయి, సిపిఐ ఎంఎల్‌ నాయకులు లక్ష్మిరెడ్డి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు పసుపులేటి మహేష్‌, ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్‌ హఫీజ్‌, మహిళ నాయకురాలు శ్యామల, నాయకులు దావులూరి దేవకుమార్‌, జన చైతన్య వేదిక నాయకులు ప్రవీణ్‌, జనసేన నాయకులు నాగార్జున, రిషి, తదితరులున్నారు.