Jul 09,2022 16:20

ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్ : చెరువు మరమ్మతుల పేరుతో చెరువులో నీళ్లను తూముల ద్వారా తీసి చేపలను పట్టుకోవడమే కాకుండా చెరువులో మట్టిని ఆక్రమణంగా  అమ్ముకొని తద్వారా లక్షలాది రూపాయలు అర్జించిన నాయకులు ఆ తర్వాత చెరువు తూమును మూయటం మరిచారని సిపిఎం పార్టీ జగ్గయ్యపేట మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి అన్నారు. మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో గల చెరువు తూము నుండి వెళుతున్న నీరును పార్టీ నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం చెరువు మరమ్మతుల పేరుతో అక్రమంగా చెరువులోని నీటిని తొలగించి తద్వారా చెరువులో చేపలు పట్టడమే కాకుండా చెరువులో గల మట్టిని జెసిబి ల ద్వారా ట్రాక్టర్లతో లక్షలాది రూపాయలు అక్రమార్జన చేసిన నాయకులు ఆ తర్వాత చెరువు తూము ముయలేదని గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి వర్షపు నీళ్ళు చెరువులోకి వచ్చి చేరుతున్నాయని చెరువు తూము మూయకపోవడంతో వృధాగా చెరువులో నీరు బయటికి పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చెరువు తూమును మూయాలని, పాలేరు ఎర్ర కాల్వ ద్వారా చెరువులో నీటిని నింపి రైతులు పంటలకు సహకరించాలని కోరారు. చెరువు మరమ్మతుల పేరుతో చెరువులోని నీటిని తీయడంతో పాటు చెరువు కట్టకు గల చెట్లను తొలగించడం తూతూ మంత్రంగా కట్టపై మట్టి పోయటం వలన చెరువు కట్టపై మట్టి వర్షానికి కొట్టుకొని పోయి నాసిరకంగా తయారైందని, చెరువు కట్టపై కొన్నిచోట్ల కట్ట ఇరువైపులా మట్టి కొట్టుకొని పోవడంతో కొద్దిగా మాత్రమే కట్ట ఉందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తూముని మూయాలని లేకపోతే తాము రైతులు, ప్రజలను కలుపుకొని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కోటా కృష్ణ, కాకనబోయిన లింగారావు, దంతాల వెంకటేశ్వర్లు, షేక్ గౌస్ మియా తదితరులు పాల్గొన్నారు.