ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : సత్యసాయి జిల్లాలోని దళిత వాడలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్యకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. జిల్లాలో చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు దళితులకు లేనందున చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాము చాలా ఏళ్లుగా దళితులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని గ్రామాల్లో పారదర్శకంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్ వెంకటేష్, వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న, కెవిపిఎస్ నాయకులు పైపల్లి గంగాద్రి, హనుమయ్య, రమణ, కదిరప్ప, రమేష్, వెంకటేష్, నరసింహ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.










